MLA Rajaiah : అనుకోని పరిస్థితిలో అడ్డంగా ఇరుక్కున్న ఎమ్మెల్యే రాజయ్య !
MLA Rajaiah : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే టాపిక్. జానకీపురం సర్పంచ్ నవ్య వర్సెస్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఈ ఎపిసోడ్ ఇప్పుడు ప్రారంభం అయింది కాదు.. చాలా రోజుల నుంచి సాగుతోంది. ఆ మధ్య నవ్య ప్రెస్ మీట్ పెట్టి మరీ రాజయ్య గురించి మొత్తం చెప్పుకొచ్చింది. దీంతో రాజయ్య నేరుగా తన వద్దకు వెళ్లి తప్పు అయింది.. ఇంకోసారి అలా జరగదు అని మీడియా ముందు వాపోయారు. అక్కడితో నవ్య ఎపిసోడ్ సుఖాంతం అయిందని అంతా అనుకున్నారు కానీ.. మళ్లీ ఆ వ్యవహారం మొదటికొచ్చింది.
సర్పంచ్ నవ్యకు డబ్బులు ఇవ్వాలని చూశారని, తనను చంపాలని కూడా చూశారని తాజాగా ఆమె ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తోంది. చివరకు తన భర్త కూడా ఎమ్మెల్యే వర్గంలో చేరిపోయారు. దీంతో తను ఒంటరి అయింది. తన భర్తకు డబ్బుల ఆశ చూపి తమవైపునకు తిప్పుకున్నారని.. తన భర్తకు విడాకులు ఇచ్చి అయినా సరే.. ఎమ్మెల్యేను అస్సలు వదలను అని మీడియా సాక్షిగా నవ్య పలుమార్లు సవాల్ విసిరింది. ఒంటరిగానే పోరాటం చేస్తున్న ఆమెకు మద్దతుగా తన అత్త, ఆడపడుచు నిలుచున్నారు.నన్ను టార్గెట్ చేసి ఊరికి ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. ఇప్పటికే చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వలేదు. బకాయిలు చెల్లిస్తామని అప్పుడు మాటిచ్చారు. ఇప్పుడు నేను వాటి గురించి ప్రస్తావిస్తే బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాలంటున్నారు.
MLA Rajaiah : బాండ్ పేపర్ మీద సంతకం ఎందుకు?
అసలు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టడం ఏంటి. నా భర్త కూడా వాళ్ల వైపే ఉన్నారు. నేను ఒంటరిదాన్ని అయ్యాను. నా భర్తకు విడాకులు ఇవ్వడానికి కూడా నేను సిద్ధం.. అంటూ నవ్య ఆరోపణలు చేసింది. తాజాగా ఆమెకు తన అత్త మద్దతు ఇవ్వడంతో ఆమె కొండంత అండ వచ్చినట్టు అయింది. నా కోడలు ఎటువంటి తప్పు చేయలేదని, ఎమ్మెల్యే రాజయ్య, అనుచరులు వేధిస్తున్నారని ఆమె తెలిపారు. గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి పనుల కోసం నా కోడలు తన ఒంటి మీద ఉన్న బంగారం కూడా అమ్ముకుందని ఆమె అత్త వాపోయారు. మరి చూద్దాం.. ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.