Telangana New Districts : 33 జిల్లాల‌ను.. 18 జిల్లాలుగా చేయ‌నున్న రాష్ట్ర ప్రభుత్వం.. కొత్త జిల్లాలు ఇవే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana New Districts : 33 జిల్లాల‌ను.. 18 జిల్లాలుగా చేయ‌నున్న రాష్ట్ర ప్రభుత్వం.. కొత్త జిల్లాలు ఇవే..!

 Authored By anusha | The Telugu News | Updated on :11 January 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Telangana New Districts : జిల్లాలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. కొత్త జిల్లాలు ఇవే..!

Telangana New Districts : గతంలో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ 33 జిల్లాలకు పెంచారు. అశాస్త్రీయంగా, అసంబద్ధంగా పాత జిల్లాలను విభజించారు. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో ఒకటిన్నర నియోజకవర్గం ఉండడం ఇందుకు నిదర్శనం. ఇంకా కొన్ని జిల్లాలలో ఒక నియోజకవర్గం మూడు జిల్లాల్లో ఉంది. దీంతో ఒక ఎమ్మెల్యే మూడు జిల్లాల పరిషత్తులలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉండాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే కేసీఆర్ 2016లో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టారు. పాలన సౌలభ్యం అని ప్రకటించినా, అధికారమంతా ప్రగతి భవన్ లోనే ఉండడంతో, జిల్లాల విభజనతో ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. రాజకీయ నిరుద్యోగులకు మాత్రం ఉపాధి దొరికింది. కొత్త జిల్లాలతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు పెరిగాయి. కొత్త మండలాలతో ఎంపీపీ పదవులు పెరిగాయి. రెవెన్యూ డివిజన్లో ఆర్డీవోలు పెరిగారు. ఇవి మినహా ఏమీ మారలేదు. ఈ క్రమంలోనే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల విభజనపై పునః సమీక్షించాలని భావిస్తుంది. జిల్లాల సంఖ్యను కుదించాలనే ఆలోచనలో ఉంది. ఏపీలో సీఎం వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి 2ఏళ్ల క్రితం జిల్లాల పునర్విభజన చేపట్టారు. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా విభజించారు. దీంతో 13 జిల్లాలు ఉన్న ఏపీ ప్రస్తుతం 23 జిల్లాలుగా ఏర్పడింది.

శాస్త్రీయంగా జరిగిన పునర్విభజనతో అక్కడ అంతా సాఫీగా సాగిపోతుంది. అంతకన్నా ముందే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేసిన కేసీఆర్ ఎక్కడ శాస్త్రీయత పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పునర్విభజనపై ఒక కమిటీని ఏర్పాటు చేసి కుదించే ఆలోచనలో ఉన్నారు. ఏపీ తరహాలోనే పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.17 పార్లమెంట్ నియోజకవర్గాలను 17 జిల్లాలుగా ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాదును రెండు జిల్లాలుగా విభజించి మొత్తంగా 18 జిల్లాలకు పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో 33 జిల్లాలు ఎందుకని జిల్లాల పునరీవ్యవస్థీకరణకు జ్యూడిషియల్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో కుదింపు అంశం ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశం అయింది. గత ప్రభుత్వం జిల్లాలను అడ్డగోలుగా, పద్ధతి లేకుండా విడగొట్టిందని రేవంత్ ఇంటర్వ్యూలో విమర్శించారు. దీంతో జిల్లాల సంఖ్యను కుదురుస్తారని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఇందులో మూలుగు, జగిత్యాల, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, సిరిసిల్ల జిల్లాలు విస్తీర్ణంలో చాలా చిన్నవి.

ఈ జిల్లాలో కేవలం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలే ఉన్నాయి. ఇలాంటి జిల్లాలను ఎత్తివేస్తారని తెలుస్తోంది. మొత్తంగా 33 జిల్లాలను 18 జిల్లాలుగా పరిమితం చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే జిల్లాలను కుదించడం అంత ఈజీ కాదని చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే అన్ని జిల్లాలలో కలెక్టరేట్లను నిర్మించారు. జిల్లాకు మెడికల్ కాలేజీ జోనల్ వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించారు. లోకల్, నాన్ లోకల్ క్యాడర్ పై స్పష్టత ఇచ్చారు. మరోవైపు జిల్లాల విభజనతో జిల్లా కేంద్రం భూముల ధరలు కూడా పెరిగాయి. ఈ క్రమంలో జిల్లాలను కుదిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలోనే జిల్లాలను కుదిస్తే తేనెతెట్టెను కదిలించినట్లే అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది