Viral News : సజ్జనార్ సార్ దయచేసి వేలాన్ని ఆపండి, ఆ కోడి నాదే ,
ప్రధానాంశాలు:
Viral News : సజ్జనార్ సార్ దయచేసి వేలాన్ని ఆపండి .. ఆ కోడి నాదే..!
Viral News : ఈనెల 9న వరంగల్ నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళుతున్న బస్సు కరీంనగర్ బస్ స్టేషన్ లో ఆగిన సమయంలో పందెంకోడిని తన వెంట తీసుకు వెళుతున్న ప్రయాణికుడు దానిని బస్సులోనే మర్చిపోయాడు. బస్సులో బ్యాగ్ గమనించిన ప్రయాణికులు విషయాన్ని కంట్రోలర్ దృష్టికి తెచ్చారు. అందులో ఏముందో పరిశీలించేందుకు ఆర్టీసీ సిబ్బంది దానిని తెరిచి చూడగా భద్రంగా ప్యాక్ చేసి ఉన్న పందెంకోడి కనపడింది. దీంతో దాన్ని సంరక్షించేందుకు ఆర్టీసీ సిబ్బంది కరీంనగర్ డిపోకు తరలించారు. మూడు రోజులుగా సిబ్బంది అటు ఆర్టీసీ బస్సులతో పాటు పందెంకోడి సంరక్షణ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. దానిని తీసుకువెళ్లేందుకు యజమాని వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో శుక్రవారం ఆర్టీసీ సిబ్బంది కోడిని వేలం వేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే కోడి తనదే అంటూ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు మహేష్ అనే వ్యక్తి. కరీంనగర్ ఆర్టీసీ బస్సులో దొరికిన కోడి నాదేనంటూ బాధితుడు వీడియో ద్వారా తన ఆవేదన తెలిపాడు. నెల్లూరు జిల్లాకు చెందిన మహేష్ బ్రతుకుతెరువు కోసం రుద్రంగికి వచ్చినట్లుగా చెప్పారు. రుద్రంగి నుండి కరీంనగర్ మీదుగా నెల్లూరు వెళ్లే క్రమంలో తెల్లవారుజామున నిద్ర మబ్బులో కరీంనగర్ బస్టాండ్ లో బస్సు దిగి కోడిని మర్చిపోయానంటూ మహేష్ వీడియో విడుదల చేశాడు. పందెంకోడి వేలాన్ని నిలిపివేయాలని డిపో మేనేజర్ సజ్జనార్ ను వేడుకున్నాడు మహేష్. కోడి యజమాని కూడా వేలం పాటలో పాల్గొనాలని, కరీంనగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ నిర్లక్ష్య సమాధానం ఇచ్చాడంటూ మహేష్ వాపోయాడు.
అంతేకాదు ప్రయాణ సమయంలో తాను కోడికి కూడా టికెట్ తీసుకున్నానని చెప్పాడు. అందుకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని మహేష్ అంటున్నారు. నాదే కోడి అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేయడంతో కోడి వేలం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆర్టీసీ నిబంధనల ప్రకారం లాస్ ఆఫ్ ప్రాపర్టీ కింద మర్చిపోయిన వస్తువుల గురించి సరైన ఆధారాలతో ఎవరూ రాకపోతే 24 గంటల తర్వాత ఆర్టీసీ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వేలంపాట నిర్వహించాల్సి ఉంటుంది అని డిపో మేనేజర్ తెలిపారు. పందెంకోడి కోసం ఎవరు రాకపోవడంతో శుక్రవారం వేలం వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఎవరైనా పాల్గొనవచ్చని సూచించారు. వచ్చిన మొత్తాన్ని ట్రెజరీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామని తెలిపారు. కోడివేలం ఆఖరి నిమిషంలో కథ ఇలా అడ్డం తిరిగింది.
సజ్జనార్ సార్ దయచేసి నా కోడి వేలాన్ని ఆపండి@tsrtcmdoffice @SajjanarVC https://t.co/gNOp1rfFIl pic.twitter.com/xw8yMkMimZ
— Telugu Scribe (@TeluguScribe) January 12, 2024