TRS Party : ఖమ్మం కారులో కుమ్ములాట.. ఎవరికి వారే ఆధిపత్య పోరు
TRS Party : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు స్టీరింగ్ తిప్పే వారు చాలా మంది అయ్యారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా టీఆర్ఎస్ పార్టీలో రోజురోజుకూ నేతల మధ్య అంతర్గత పోరు ఎక్కువవుతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యాలు టీఆర్ఎస్ పార్టీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో చర్ఛనీయాంశంగా మారాయి.
TRS Party : తాజా, మాజీల మధ్య పోరు.. !
ఇటీవల ఓ సమావేశంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాను పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉంటానని, పదవి లేదని బెడ్ షీట్ కప్పుకుని ఇంట్లో పడుకోబోనని చెప్పారు. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా తాను ప్రజల్లోనే తిరుగుతూ ఉంటానని, తాను పార్టీ మనిషినని చెప్పుకొచ్చారు. తనకు ఈ రోజు పదవి లేదని అయితే తాను పార్టీ అధినేతను నమ్మకున్నానని, మీరు కూడా అలాగే చేయాలని, ఎవరో మీద పదువులు తీసేస్తారని దిగులు పడొద్దని టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి పొంగులేటి అన్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీకి తననే మోడల్‌గా తీసుకోవాలని, పార్టీ బలోపేతం దిశగా అందరం కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే పొంగులేటి మాటలను బట్టి జిల్లా టీఆర్ఎస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయని స్పష్టమవుతున్నది.
ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేతలందరు ఎవరి వర్గాన్ని వారు కాపు కాస్తూనే తమ సత్తా చాటేందుకు, తమ ఉనికిని నిలుపుకునేందుకుగాను ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం జిల్లా రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇకపోతే జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఆర్ఎస్ లోకసభ పక్షనేత నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఉన్నారు.ఈ క్రమంలోనే సీనియర్ నేతలు ఎక్కువయ్యారని, తాజా, మాజీల మధ్య పోరు అంతర్గతంగా ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తుమ్మల, పొంగులేటి, జలగం వర్గాలు ఉన్నాయని వారందరికీ సెపరేట్ గ్రూపులు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు మధ్య పోరు ఉందని రాజకీయ వర్గాలతో పాటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఈ క్రమంలోనే జిల్లాలోని టీఆర్ఎస్ నేతల మధ్య సమన్వయంపై అధిష్టానం దృష్టి సారించాలని టీఆర్ఎస్ శ్రేణులు కోరుతున్నాయి.