Prashant Kishor : పీకే నీ సత్తా ఇక్కడ చూపించు.. అక్కడ వేరు.. ఇక్కడ వేరు..!
Prashant Kishor : భారత రాజకీయాల్లో వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎవరి వైపున ఉంటే వారు తప్పకుండా గెలుస్తారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే, పీకే వ్యూహాల వల్ల విజయాలు సాధించిన వారు చాలా మందే ఉన్నప్పటికీ ఈ సారి ఆయనకు పెద్ద సవాల్ వచ్చిపడిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.తెలంగాణలో మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్‌టీపీ పాల్గొననుంది. ఇందుకుగాను ఇప్పటికే నుంచి వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వై.ఎస్.షర్మిల గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది.
కాగా, షర్మిల కోసం పీకే టీం పని చేస్తుండగా, ఇక్కడ షర్మిల గెలుపోటుల ద్వారానే రాజకీయ వ్యూహకర్తగా పీకే పని తీరు, సత్తా బయటపడుతుందనే కామెంట్స్ రాజకీయ వర్గాల నుంచి వినబడుతున్నాయి. పీకే అనేక రాష్ట్రాల్లో వ్యూహకర్తగా పని చేసి ఆయా రాజకీయ నాయకులను ముఖ్యమంత్రులను చేశారు. ఏపీ నుంచి మొదలుకుని ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ వరకు పీకే వ్యూహాలు ఫలించాయి. పశ్చిమబెంగాల్‌లో ఈ సారి కమలనాథులు సత్తా చాటుతారనే వాదనలు బలంగా వినబడినప్పటికీ మమతా బెనర్జీ వైపు నిలబడి ఆమెకు ఫుల్ మెజారిటీని అందించారు పీకే. ఈ క్రమంలోనే పీకే రాజకీయ పలుకుబడి ఇంకా పెరిగింది. కాగా, మిగతా రాష్ట్రాలు వేరు తెలంగాణ వేరు… తెలంగాణలో షర్మిలను పీకే గెలిపించగలడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో బలమైన ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది.
Prashant Kishor : వైఎస్‌ఆర్‌టీపీ కనీసం పది సీట్లైనా గెలుచుకోగలదా?
రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్‌ను ఓడించి వైఎస్‌ఆర్‌టీపీ అధికారంలోకి రాగలదా? అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. తెలంగాణలో ప్రతిపక్షాలు కూడా బలంగానే ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీపై బలంగా పోరాడుతున్నారు. మరో వైపున ఐపీఎస్ మాజీ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా ఉండి.. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వైఎస్‌ఆర్‌టీపీ ఏ మేరకు ప్రభావం చూపగలదని అనుకుంటున్నారు. ఈ నెల 20 నుంచి షర్మిల ప్రారంభించే పాదయాత్రను పీకే టీం ప్లాన్ చేయగా, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్‌టీపీ కనీసంగా పది సీట్లైనా గెలుచుకోగలదా? అని పలువురు చర్చించుకుంటున్నారు.