YS Sharmila : జగన్ గెలుపుపై హైకమెండ్‌కి షర్మిళ అలాంటి రిపోర్ట్ పంపిందా?
YS Sharmila : ఈ సారి ఏపీ రాజకీయాలు ఎంత హాట్ టాపిక్ అయ్యాయో మనం చూశాం. జగన్ ఒకవైపు , మిగతా పార్టీలు ఒకవైపు . అయితే ఏపీ రాజకీయాల్లో అన్నాచెల్లెలి యుద్ధం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.. ఎప్పుడూ లేని విధంగా వైఎస్ఆర్ కుటుంబం రెండుగా విడిపోయి 2024 ఎన్నికల్లో తలపడింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఓ వైపు.. వైఎస్ జగన్ చెల్లెళ్లు వైఎస్ షర్మిల, సునీత మరోవైపు నిలబడి తలబడ్డారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య మాటలు కూడా తూటాల్లా పేలాయి. తన చెల్లెలు షర్మిల పచ్చ చీర కట్టుకుని ప్రత్యర్థుల ఇళ్లకు వెళ్లి వారితో చేతులు కలిపిందంటూ వైఎస్ జగన్.. షర్మిలను ఉద్దేశించి నేరుగా విమర్శలు చేశారు.
YS Sharmila : అంతా టెన్షన్.. టెన్షన్
ఇక బాబాయి వివేకాను చంపిన హంతకులకు జగన్ టికెట్ ఇచ్చారంటూ షర్మిల ఆరోపించారు. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి మీదకు పోటీకి కూడా దిగారు షర్మిల. ఈ క్రమంలోనే ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిలకు డిపాజిట్లు కూడా దక్కవనే బాధ తనకు ఉందంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఏదైతేనేం హోరెత్తించే మాటలతో ప్రమోషన్స్ చేసిన పార్టీల నాయకులు ఇప్పుడు జూన్ 4న రాబోవు ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూన్ 1 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలవ్వబోతుండటంతో ఈ టెన్షన్ మరింత పెరిగిందని చెబుతున్నారు..
కేంద్రంలోని ప్రధాన పార్టీల దృష్టి ఇప్పుడు ఏపీ ఫలితాలపై తీక్షణంగా ఉందని అంటున్నారు. ఏపీలో జగన్ గెలిచే ఎంపీ స్థానాలపై హస్తినలోని కాంగ్రెస్ హై కమాండ్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో జగన్ గెలుచుకునే ఎంపీ స్థానాలపై నివేదిక ఇవ్వాలని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిళను కాంగ్రెస్ హస్తిన పెద్దలు కోరినట్లు తెలుస్తుంది. దీంతో షర్మిళతో పాటు.. ఏపీలో హై కమాండ్ కు అత్యంత సన్నిహిత నేత ఒకరు కలిసి ఏపీలో రాబోయే అవకాశం ఉన్న ఫలితాలపై రిపోర్ట్ ఇచ్చారని తెలుస్తుంది. ఇదే సమయంలో ఇండియా కూటమికి జగన్ మద్దతు కూడా ఉండదని నొక్కి చెప్పినట్లు సమాచారం.