Tuni Assembly Constituency : తునిలో ఆయన గెలిస్తే హ్యాట్రిక్.. ఆమె ఓడితే డబుల్ హ్యాట్రిక్..!
Tuni Assembly Constituency : ఏపీలో తుని నియోజకవర్గానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో రాజకీయాలను శాసించిన లీడర్ ఇక్కడి నుంచే వచ్చారు. ఆయనే యనమల రామకృష్ణుడు. యనమల ఫ్యామిలీకి తునిలో బలమైన పట్టు ఉంది. ఆ ఫ్యామిలీ ఇక్కడి నుంచే ఏపీ రాజకీయాలను శాసించింది. అయితే అటు టీడీపీలో, రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గంలో మాత్రం పట్టు కోల్పోయారు. 2004 వరకు ఆయన వరుసగా గెలుస్తూ వచ్చారు. కానీ 2009 ఎన్నికల నుంచే యనమల కుటుంబానికి తునిలో పట్టు తగ్గిపోతూ వస్తోంది.
అతనిపై జగన్ నమ్మకం..
ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో యనమల ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని తన తమ్ముడు కృష్ణుడిని పోటీ చేయిస్తూ వచ్చారు. ఆయన తమ్ముడు రెండు సార్లు పోటీ చేసినా ఓడిపోయారు. ప్రతి ఎన్నికల్లో యనమల రామకృష్ణుడి ఫ్యామిలీకి పట్టు తగ్గిపోతూ.. మెజార్టీ కూడా తగ్గుతూనే వస్తోంది. ఇటు వైపు నుంచి రెండు సార్లు దాడిశెట్టి రాజా వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయనకు రెండు ఎన్నికల్లోనూ క్రమ క్రమంగా మెజార్టీ కూడా పెరుగుతూ వచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో మరోసారి ఆయన మీద నమ్మకం ఉంచి టికెట్ కేటాయించారు జగన్ మోహన్ రెడ్డి. అయితే ఈ ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు తన కుమార్తె దివ్యను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తున్నారు. ఆమె టీడీపీ టికెట్ మీద పోటీ చేస్తున్నారు.
దాంతో ఈ ఎన్నికల్లో ఇప్పుడు హ్యాట్రిక్ వర్సెస్ డబుల్ హ్యాట్రిక్ అనే ట్రెండ్ నడుస్తోంది. హ్యాట్రిక్ గెలుస్తుందా లేదంటే డబుల్ హ్యాట్రిక్ ఓడిపోతుందా అంటూ బెట్టింగ్ లు వేస్తున్నారు. యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ఓడిపోతే ఆ ఫ్యామిలీకి ఇది డబుల్ హ్యాట్రిక్ గా ఓడిపోవడం అవుతుంది. అదే దాడిశెట్టి రాజా గెలిస్తే మాత్రం హ్యాట్రిక్ గెలుపు అవుతుంది. అందుకే ఈ ఎన్నికల్లో ఈ ట్రెండ్ నడుస్తోందని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమ ఫ్యామిలీకి మళ్లీ పట్టు పెంచుకోవాలని యనమల ప్లాన్ వేస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో టీడీపీ తమ్ముళ్లు కూడా బలంగానే పోరాడారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.