Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఒక్క ముక్కలో డౌట్లన్నీ క్లియర్ చేసిన కేంద్రం?
Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఆందోళనలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు. ప్రతి రోజూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలంటూ కార్మికులు, ఏపీ ప్రజలు ధర్నాలు, నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మార్చి 5న ఏపీ వ్యాప్తంగా బంద్ కూడా నిర్వహించారు. ఇప్పటికీ నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ ఏపీ వ్యాప్తంగా ప్రజలు నినదిస్తున్న ఈ సమయంలో.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది.
సూటిగా సుత్తి లేకుండా.. ఒక్క మాటలో కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చేసింది. వైసీపీకి చెందిన వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.. లోక్ సభలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా ఆయనకు సమాధానమిచ్చారు.
Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో.. ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని.. స్టీల్ ప్లాంట్ లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్లు లేవని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి, ఏపీ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదంటూ తేల్చి చెప్పారు.
స్టీల్ ప్లాంట్ నుంచి 100 శాతం పెట్టుబడులను ఉపసంహరించి.. ప్లాంట్ ను పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తున్నట్టు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ ప్రభుత్వంలో ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపాం.. అంటూ నిర్మల స్పష్టం చేశారు.
అయితే.. మెరుగైన ఉత్పాదకతను పెంచడం కోసం, ఉపాధిని పెంచడం కోసం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ కానీ.. పార్ట్ నర్స్ కానీ.. కంపెనీ షేర్లు కొనేలా ప్రత్యేక ప్రతిపాదనలు చేస్తున్నాం.. అని నిర్మలా సీతారామన్ ఎంపీ అడిగిన ప్రశ్నకు బదులుగా సమాధానం చెప్పారు.