Heavy Rains : కోస్తాంద్ర ఇంకా కోలుకోనే లేదు.. ఉత్తరాంధ్రపై పగ బట్టిన వరుణుడు..!
ప్రధానాంశాలు:
Heavy Rains : కోస్తాంద్ర ఇంకా కోలుకోనే లేదు.. ఉత్తరాంధ్రపై పగ బట్టిన వరుణుడు..!
Heavy Rains : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వరుణుడు భయబ్రాంతులకి గురి చేస్తున్నాడు. ఎక్కడ చూసిన వరదలే కనిపిస్తున్నాయి. ఇటీవల వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. విజయవాడ ప్రజలు ఇప్పుడిప్పుడే ఈ సమస్యల నుంచి కోలుకుంటున్న తరుణంలో ఉత్తరాంధ్ర ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాయుగుండం ప్రభావం వల్ల గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 10.35 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వానల వల్ల ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లో గెడ్డలు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఇళ్లు సైతం ముంపు బారిన పడటం గమనార్హం.
Heavy Rains ఉత్తరాంధ్ర వణికిపోతుంది..
ప్రధాన ప్రాజెక్టులైన ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలంలకు వరద పోటెత్తుతోంది. అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు, అనకాపల్లి జిల్లాలోని తాండవ జలాశయంలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అధికారులు ఇక్కడ రెండు గేట్లు ఎత్తి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 379 అడుగులుగా నమోదైంది. తాండవ జలాశయం వరద రహదారిపై పొంగి ప్రవహిస్తోన్న క్రమంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ఉప్పరగూడెం – గన్నవరం మెట్ట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు, కల్యాణపులోవ జలాశయం ప్రమాదకర స్థాయికి చేరుకోగా.. 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నర్సీపట్నం – తుని మధ్య వాహనాల రాకపోకలను నిలిపేశారు. నర్సీపట్నం – తుని మధ్య వాగులు పొంగి పొర్లుతున్నాయి. అల్లూరి జిల్లాలోని వట్టిగెడ్డ జలాశయం పొర్లు కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా రాకపోకలు నిలిచిపోయాయి. రాజవొమ్మంగి మండలం ఎర్రంపాడు వద్ద వట్టిగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జోలాపుట్ జలాశయం నుంచి 23 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అటు, డుడుమా జలాశయం 4 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కిర్లంపూడి, పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాకినాడ జిల్లాలోని విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. పెద్దాపురం, సామర్లకోట మండలాలకు ముప్పు పొంచి ఉండగా.. క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.