Business Idea : టైలరింగ్ బిజినెస్ చేస్తూ నెలకు లక్ష సంపాదిస్తోంది… ఎలా సాధ్యం అయిందో తెలుసా?
Business Idea : కొన్ని నిర్ణయాలు మన జీవితంపై చాలా ప్రభావాన్ని చూపుతాయి. ఆ నిర్ణయాల ప్రభావం ఎంతలా ఉంటుందంటే.. అప్పటి వరకు నరకప్రాయంగా ఉండే పరిస్థితి ఆ ఒక్క నిర్ణయంతో ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ ఆ నిర్ణయాన్ని తీసుకోవడం, తీసుకున్న డిసిషన్ పై ధృడంగా నిలబడటంపైనే విజయం దాగి ఉంటుంది. అలాంటి ఒక కఠిన నిర్ణయమే అస్సాంలోని రంగియాకు చెందిన రుంజున్ బేగం జీవితాన్ని మార్చేసింది.రుంజున్ బేగం భర్త నుంచి అత్తమామల నుంచి తీవ్ర వేధింపులను ఎదుర్కొంది. తనకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టడంతో వేధింపులు మొదలయ్యాయి. రెండోసారి కూడా ఆడపిల్లే కావడంతో ఆ వేధింపులు తీవ్రమయ్యాయి.
ఎంతలా అంటే తన భర్త తనను తీవ్రంగా చిత్రహింసలు పెట్టేవాడు.అడ్డుకోవాల్సిన అత్తమామలు వారి కొడుక్కు వంత పాడే వారు. రుంజున్ బేగాన్ని తీవ్రంగ వేధించేవారు. మూడోసారి తను గర్భం దాల్చినప్పుడు ఆ గర్భాన్ని తీయించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టడం తమకు ఇష్టంలేదని అనేవారు. రుంజున్ వినకపోవడంతో తనను చలికాలం అని కూడా చూడకుండా బయటే ఉంచేవారు. అలాంటి క్లిష్ట సమయంలోనే రుంజున్న ఒక నిర్ణయానికి వచ్చింది. ఆమె అప్పుడు ఐదు నెలల గర్భవతి. తన పిల్లలను, తన భర్తను ఇంటిని వదిలి పారిపోయింది. నగరానికి వచ్చి టైలరింగ్ వ్యాపారాన్ని మొదలు పెట్టింది. ఎంతో కష్టపడి తన బిజినెస్ ను నిలబెట్టుకుంది.
ఇప్పుడు నెలకు దాదాపు లక్ష రూపాయలు సంపాదించడంతో పాటు మరో 10 మంది మహిళలకు ఉచితంగా కుట్టు పనిలో శిక్షణ ఇస్తోంది.గృహ హింసకు వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశంలో 31 ఏళ్ల రుంజున్ బేగంకు అస్సాం సాంఘిక సంక్షేమ మంత్రి అజంతా నియోగ్ ఇటీవల సత్కరించారు. నాకు సత్కారం లభించిందని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని.. తన తండ్రి తన వల్ల చాలా గర్వపడతాడని చెబుతోంది రుంజున్. ఇంటి నుంచి పారిపోయి వచ్చినప్పుడు తన కాళ్లపై తను నిలబడి జీవించగలదన్న ధైర్యం ఏమాత్రం లేదని… కానీ చుట్టుపక్కల వాళ్ల సాయంతో ఈ స్థాయికి చేరుకున్నట్లు చెబుతోంది. అలాగే తన పిల్లాడిని పెంచి పెద్ద చేస్తున్నట్లు పేర్కొంది.