Business idea : పైలెట్ గా విధులు నిర్వర్తిస్తూనే బటర్ చికెన్, బర్గర్ అమ్ముతూ 13 కోట్లు సంపాదిస్తున్నాడు.. ఎలాగో తెలుసా?
Business idea : ప్రతి ఒక్కరికి ఒకటికి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఉండాలని ఆర్థిక నిపుణులు ఎప్పుడూ చెప్పే మాట. ఎందుకంటే ఒక ఆదాయ మార్గంలో ఒడిదొడుకులు ఎదురైనా.. అందులో నుండి ఇన్‌కం రావడం ఆగిపోయినా జీవితం సాఫీగా సాగేందుకు ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉండాలని అంటారు. కరోనా సమయంలో చాలా రంగాలు ఎంత సంక్షోభం ఎదుర్కొన్నాయో తెలిసిందే. చాలా సంస్థలు మూత పడ్డాయి. మరి కొన్ని మూత పడే దుస్థితికి వచ్చాయి. ఉద్యోగస్థులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి ఏ సంక్షోభాలు వచ్చినా.. తట్టుకుని నిలబడేందుకు.. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కచ్చితమైన ప్రణాళిక ఉండాలని అంటారు. ఇదే ఆలోచన వచ్చింది ఉత్తరప్రదేశ్ కు చెందిన పైలట్ రజత్ జైస్వాల్‌కు. ఒక వైపు పైలట్‌గా పనిచేస్తూనే..
ఫ్రెండ్‌తో కలిసి వాట్-ఎ-బర్గర్‌ను స్థాపించి విజయవంతంగా దానిని నడుపుతున్నాడు. ఏడాదికి రూ.13 కోట్లు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం వాట్-ఎ-బర్గర్ 16 నగరాల్లో 60 అవుట్‌లెట్‌లు తెరిచింది. చికెన్ మఖానీ, తందూరి, ఆలూ ఆచారి, డబుల్ డెక్కర్ వంటి రుచులు షేక్స్ మరియు ఫ్రైస్‌ను అందిస్తోంది వాట్-ఎ-బర్గర్. ఎయిర్‌లైన్ పరిశ్రమలో ఉన్న మార్పుల కారణంగా స్వంత వెంచర్‌ను నిర్మించాలనుకున్నానని చెబుతాడు రజత్ జైస్వాల్. గత 12 సంవత్సరాలలో, మూడు ప్రధాన విమానయాన సంస్థలు మునిగిపోయాయని, పరిశ్రమ అస్థిరంగా ఉందని అంటాడు రజత్. ఏ సంస్థ ఎప్పుడు కూలిపోతుందో.. ఏ ఉద్యోగిని ఎప్పుడు తీసేస్తారో తెలియని పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నాడు. పరిస్థితి ఏమాత్రం బాగాలేని ఇలాంటి స్థితిలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని.. ఆదాయం ఆగిపోతే జీవితం సాగడం కష్టంగా మారుతుందని అంటున్నాడు రజత్ జైస్వాల్.
అందుకే స్నేహితుడితో కలిసి వాట్-ఎ-బర్గర్‌ను ప్రారంభించినట్లు వివరిస్తున్నాడు. వెంచర్ అయితే ప్రారంభించారు కానీ.. మార్కెట్‌లో చాలా పోటీ ఉందని, వాటిని ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారిందని అంటున్నాడు. మెక్ డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, బర్గర్ కింగ్ వంటి అంతర్జాతీయ బర్గర్ చెయిన్ లతో సహా పెద్ద బ్రాండ్‌లు ప్రత్యక్ష పోటీదారులుగా ఉన్నా… వాటిని తట్టుకుని పోటీలో నిలబడ్డామని చెబుతాడు రజత్. వెంచర్ ను ముందుకు తీసుకెళ్లేందుకు… ధైర్యంగా పోటీలో నిలబడేందుకు చాలా కష్టపడ్డామని అంటాడు. మొదట్లో అవుట్ లెట్ ల బయట నిలబడి, కస్టమర్ లకు బర్గర్ లను అందించామని… టేస్ట్ నచ్చక పోతే డబ్బులు వాపస్ ఇస్తామన్న హామీతో ప్రచారం చేశామని వివరించాడు రజత్. అదృష్టవశాత్తూ తమ ప్రచారం మంచి ఫలితాలను ఇచ్చిందంటారు. ప్రజలు వాట్-ఎ-బర్గర్ ను స్వాగతిస్తున్నారని ఆనందంగా చెబుతాడు రజత్ జైస్వాల్.