Business Idea : అరుదైన మామిడి కాయలను పండిస్తూ లక్షలు గడిస్తున్న రైతు.. ఒక్క మామిడి కాయకు ఎంత ధరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Business Idea : అందరూ చేసినట్లుగా మనమూ చేస్తే దానికి తగిన గుర్తింపు రాదు. మనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నప్పుడే అందరూ గుర్తించడం మొదలు పెడతారు. ఈ సూత్రం ముఖ్యంగా వ్యాపారాల్లో చాలా బాగా పని చేస్తుంది. కొత్తదనం ఉంటేనే ప్రజల నుండి ఆదరణ ఉంటుంది. మధ్యప్రదేశ్ లోని కత్తివాడకు చెందిన శివరాజ్ సింగ్ జాదవ్ ఈ సూత్రాన్ని చక్కగా ఒంటబట్టించుకున్నారు. ఇప్పుడు లక్షల కొద్దీ సంపాదిస్తున్నారు. ఆయన తన 16 ఎకరాల తోటలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 33 రకాల మామిడి పండ్లను పండిస్తున్నారు.అందులో అరుదైన రకానికి చెందిన మామిడి పండ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నూర్జహాన్ పేరు ఉన్న మామిడి పండ్లు ఆయనకు మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయి. 16 ఎకరాల తోటలో నూర్జహాన్ రకం మామిడి చెట్లు కేవలం ఐదు మాత్రమే ఉన్నాయి.
ఈ చెట్లు దాదాపు 50 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఒక్కో చెట్టుకు 100 కంటే తక్కువే పండ్లు కాస్తాయి. మొత్తం 5 నూర్జహాన్ చెట్ల నుండి వచ్చే కాయల సంఖ్య కేవలం 350కి కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి అంతే. కానీ వీటి నుండి వచ్చే లాభం అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఈ నూర్జహాన్ మామిడి పండ్లు ఒక్కోటి 3 నుండి 3.5 కిలోల బరువు ఉంటాయి. వాటి బరువును, సైజును బట్టీ వీటికి ధర ఉంటుంది. ఒక్కో పండు ధర రూ. 500 నుండి రూ. 1500 వరకు అమ్ముడవుతాయి. చాలా తక్కువ సంఖ్యలోనే పండ్లు కాయడం వల్ల వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దాని వల్ల లక్షల్లో ఆదాయం వస్తోందని చెబుతున్నాడు శివరాజ్ సింగ్ జాదవ్.నూర్జహాన్ చెట్లు ప్రతి ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి మాసాల్లో పూత వస్తుంది. జూన్ నెలలో పండ్లు కోతకు వస్తాయి. ఈ నూర్జహాన్ చెట్లను వందల ఏళ్ల క్రితం అఫ్ఘనిస్థాన్ నుండి గుజరాత్ మీదుగా మధ్యప్రదేశ్ కు చేరుకున్నట్లు చెబుతారు.

Business Idea madhya pradeesh noorjahan mango farm katthiwada rare unique india
ఈ రకం చెట్లు కేవలం శివరాజ్ దగ్గరే కాకుండా దేశవ్యాప్తంగా చాలా మంది పండిస్తున్నారు. కానీ ఇక్కడ పండే మామిడి పండ్ల పరిమాణం, అలాగే రుచి బాగుంటుందని రైతు శివరాజ్ చెబుతున్నారు. నూర్జహాన్ చెట్లు ప్రధానంగా నేల, వర్షపాతం, వాతావరణం మరియు ఇతర భౌగోళిక పరిస్థితుల వల్ల చెట్లు వృద్ధి చెందుతాయని ఆయన అంటారు. ఈ మామిడి పండ్లకు ఇటీవలి కాలంలో వచ్చిన ఆదరణ గురించి శివరాజ్ చెప్పారు. తన పొలంలో పండే నూర్జహాన్ మామిడి పండ్లు ఎంతో ప్రసిద్ధి చెందాయని.. వాళ్ల తండ్రి కూడా దూరదర్శన్‌లో కనిపించారని తెలిపారు శివరాజ్.ఈ మధ్య శివరాజ్ పొలంలో పండిన నూర్జహాన్ మామిడి పండ్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అల్ఫోన్సో, బాదామి, దసరి, కేసరి, రస్పూరి, లాంగ్రా, ఆమ్రపాలి వంటి మామిడి రకాలు ప్రసిద్ధి చెందాయని, అరుదైన నూర్జహాన్ కూడా ఇటీవల ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకున్నందుకు సంతోషంగా ఉందని శివరాజ్ చెబుతున్నారు.