Chanukya Niti : చాణక్యు నీతి.. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే స్నేహితుల చేతిలో మీరు మోసపోయినట్టే..!
Chanukya Niti : చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనకు తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ పాటించేవారు అనేకం. ఆచార్య చాణుక్యుడు రచించిన అర్థశాస్త్రంలోని జ్ఞానం నేటికీ ఆచరణీయం. ఈయన రచయితగా, సలహాదారునిగా చాణుక్యుడు ఎనలేని ఖ్యాతిని గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు యువతకు మంచి భవిష్యత్ను రూపొందించుకునేలా తోడ్పడుతున్నాయి. వాటిల్లో స్నేహం గురించి ఆయన చెప్పిన కొన్ని మాటలు ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
చాణక్యుడు తన నీతిశాస్త్రంలో మంచి స్నేహితుడిని ఎన్నుకునేటప్పుడు ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి పేర్కొన్నాడు. వీటిని పాటించకుంటే ఆయా వ్యక్తులు భవిష్యత్తులో పశ్చాత్తాపపడవలసి వస్తుందని ఆచార్యుడు ముందే చెప్పారు. చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. నిజమైన మిత్రుడిని ఎలా గుర్తించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 1. ఆర్థిక సంక్షోభంలో సాయ పడేవాడు: చాణక్యుడి ప్రకారం, ఆర్థిక సంక్షోభంలో ఉన్న వ్యక్తికి సాయం చేయడానికి ముందుకొచ్చే స్నేహితుడే నిజమైన స్నేహితుడని అర్థం. మిత్రుడి సమస్యలను అర్థం చేసుకుని, వాటి నుండి బయటపడేందుకు కృషి చేసేవాడే.. అసలైన స్నేహితుడు.
2. క్లిష్ట పరిస్థితుల్లో కూడా తోడుండేవాడు:
చాణక్యుడి ప్రకారం ఆపత్కాల పరిస్థితుల్లో కూడా తోడుగా నిలబడే వాడే నిజమైన స్నేహితుడు. కష్టాలు వచ్చినప్పుడు మనల్ని వదిలి వెళ్ళే వారితో ఎప్పటికీ స్నేహం చేయవద్దని ఆయన పేర్కొన్నారు.
3. అనారోగ్యంలో పక్కనుండే వాడు:
రోగంతో బాధపడుతున్నా… ఓ కుటుంబ సభ్యుడిగా మన వెంటే ఉండి మనకి సాయ పడేవాడు నిజమైన మిత్రుడని ఆచార్య చాణక్యుడు వివరించాడు. అటువంటి సమయంలోనే అసలు స్నేహితులను గుర్తించ వచ్చునని తెలిపిన ఆయన… అలాంటి వారిని ఎన్నటికీ వదులుకోవద్దని సూచించారు.
4. అన్ని వేళల అండగా నిలబడే వ్యక్తి:
కుటుంబ సభ్యులు చనిపోయినపుడో, ఏదైనా పోగొట్టుకున్నప్పుడో… మనల్ని ఓదార్చే వారు ఒకరు అవసరం. క్లిష్ట పరిస్థితుల్లో.. అలా మనల్ని ఓదారుస్తూ ఎవరైతే మనకు బాధ నుంచి విముక్తి కలిగిస్తారో వారే అసలైన స్నేహితుడని చాణక్యుడు పేర్కొన్నారు