Ratha Saptami : రథసప్తమినాడు ఇలా చేస్తే మీకు సంపూర్ణ అరోగ్యం ఖాయం !
Ratha Saptami :(రథసప్తమి ఫిబ్రవరి 19 సందర్భంగా ప్రత్యేకం) :మాఘమాసంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో రథసప్తమి ఒకటి. ఈరోజు సూర్యభగవానుడి ఆరాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. మరీ ముఖ్యంగా కరొనా సమయంలో అందరికీ కావల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం ఇచ్చే దేవుడు భాస్కరుడు. ఆయనను నిత్యం ఎవరు ఆరాధిస్తారు వారు తప్పక ఆరోగ్యవంతులు అవుతారు. ఏడాది మొత్తంలో శ్రీ సూర్యనారయణ స్వామిని విశేషంగా ఆరాధించే పర్వదినం. ఈ రోజు చేసే మాఘస్నానానికి చాలా విశేషత ఉంది. రథసప్తమి నాటి ఉదయం సూర్యోదయానికి ముందే ఏడు తెల్లజిల్లేడు ఆకులను, రేగు ఆకులను తలపై ఉంచుకుని స్నానం చేయడం ఆరోగ్యకరం.
Ratha Saptami : ఈ స్నానం చేసే సమయంలో క్రింది శ్లోకాన్ని చదువుకోవాలి…
‘’యద్యజ్జన్మకృతం పాపం మయాసప్తమ జన్నసు
త న్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ
ఏ తజ్జన్మ కృతం పాపం యచ్చ జనాంతరార్జితం
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః
ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర సప్తమి మే హరః ||
ఏతన్మంత్రమయం జప్త్వా స్నాత్వా పాదోదకే నరః
కేశవాదిత్య మాలోక్య క్షణా న్నిష్కల్మషో భవేత్ || ‘’
దీని అర్థం మనం ఎత్తిన జన్మ మొదటి నుండి చేసిన పాపం, జన్మాంతరాలలో చేసిన పాపం, రోగ రూపంలో, శోక రూపంలో వేదించే పాపమంతా మకరంలో ఉండే సప్తమి హరింపజేయాలనీ, సూర్య ప్రియమైన ఈ మకరసప్తమి ఈ జన్మలోనూ, జన్మాంతరాలలోనూ మనసుచేత, వాక్(మాట) చేత, ఇంద్రియాల చేత తెలిసీ తెలియక చేసిన పాపమంతా ఈ స్నానంతో నశించాలనేది అర్ధం.
ఇక స్నానం చేయగానే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యాన్ని ఇవ్వడం అంటే .. రాగి చెంబులో నీరు తీసుకుని అందులో ఎర్రని పూలు, ఎర్ర గంధం, ఎర్రని అక్షతలు, లేత జిల్లేదు ఆకులు, గరిక ఇవన్నీ కొద్దిగా ఆ నీటిలో వేసి సూర్య భగవానుడికి చూపించి వదలాలి. దీనిని అర్ఘ్యం అంటారు. నీరు వదులుతూ ఈ శ్లోకం చెప్పుకోవాలి.
‘’ సప్తసప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర’’
ఈ విధంగా చేస్తే మీకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.
సూర్యోదయ సమయానికి ముందే స్నానం, తర్వాత అర్ఘ్యం వదలడం తర్వాత అవకాశం ఉంటే ఆదిత్యహృద్యం పారాయణం లేదా కనీసం ఆదిత్యుడి పన్నెండు నామాలను చదువుకోవడం వల్ల అత్యంత శుభఫలితాలు వస్తాయి.