Kanaka Durga Temple : శ్రీకనకదుర్గమ్మ గుడిలో మార్చి 9 నుంచి మహాశివరాత్రి వేడుకలు !
Kanaka Durga Temple : ప్రముఖ పుణ్యక్షేత్రం … విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గగుడిలో మహాశివరాత్రి వేడుకలు ఈ నెల 9 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నట్లు దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు స్థానాచార్య శివప్రసాదశర్మ ఒక ప్రకటనలో వెల్లడించారు. మార్చి 9 ఉదయం 8 గంటలకు గంగా, పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు ఆలయ ప్రాంగణంలో మంగళ స్నానాలు నిర్వహించి, వధూవరులుగా అలంకరిస్తారు.
సాయంత్రం 4గంటలకు మండపారాధన, కలశస్థాపన, అగ్నిప్రతిష్ఠాపన, మూల మంత్ర హవనాలతో మహాశివరాత్రి వేడుకలకు అంకురార్పణ చేస్తారు. 10, 11 తేదీల్లో ఉదయం 8కి, సాయంత్రం 4గంటలకు మండపారాధన, కలశారాధన, హారతులు, 11న రాత్రి 8.30 గంటలకు మహాన్యాసం, లింగోద్భవకాలంలో అభిషేకం అనంతరం శ్రీగంగా, పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామి దివ్యలీలాకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారని పేర్కొన్నారు.

Shivaratri fete at Durga temple from Marchi 9th
12న ఉదయం, సాయంత్రం స్వామికి మండపారాధన, కలశారాధన, హారతులు, 13న ఉదయం 9గంటలకు పూర్ణాహుతి, ధ్వజావరోహణం, సాయంత్రం కెనాల్ రోడ్డులో కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవం, 14న దుర్గాఘాట్లో 9గంటలకు అవభృధోత్సవం, సాయంత్రం 7కి పంచహారతులు, ద్వాదశ ప్రదక్షిణలు, 15, 16 తేదీల్లో రాత్రి 8గంటలకు ఆది దంపతులకు పవళింపు సేవ నిర్వహిస్తారని తెలిపారు. భక్తలు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ దర్శనాలకు రావాలని అధికారులు పేర్కొంటున్నారు. కృష్ణానది తీరంలో ఉన్న ఇంద్రకీలాద్రిలో ఏటా వేలాది మంది శివ ఉత్సవాలకు హాజరవుతారు.