ఇంటి పెద్ద మరణిస్తే శివాలయ నిద్ర చేస్తారు.. ఎందుకు?
ఎవరికైనా ఎంతటి వారికైనా, మహాత్ములకైనా, చండాలునికైనా మరణం తప్పదు. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని కోట్లు సంపాదించిలా… వందేళ్లు తపస్సు చేసినా మృత్యువుని తప్పించుకొని బతకడం ఏ ప్రాణికి సాధ్యం కాదు. అందరూ ఏదో ఒక సమయంలో మరణిస్తారు. అందరూ మరణించాల్సిందే. అయితే పుట్టుక అనేది ఉన్న ఎవరైనా గిట్టి తీరాల్సిందే. అందుకే కర్మ యోగులు, తత్వజ్ఞానులు, మరణాన్ని దేహ ధర్మంగా భావిస్తారు. కానీ అస్సలే దుఃఖించరు. మనిషి గొప్పతనం మనిషి ప్రణాళికాతత్వం, మనిషి ధర్మ బద్ధ జీవితం, మనిషి చేసిన పుణ్యం, మనిషి మరణ దినాల్లోనే తెలుస్తుందంటారు మన పెద్దలు. కుటుంబ సభ్యుల ఆత్మీయతల మధ్య బంధువుల ఆదరణల మధ్య ఇహలోక యాత్రను ముగించుకున్నవాడే ధన్య జీవుడు. పుణ్యమార్తి.
అయితే ఇంటి పెద్ద ఇహ యాత్ర ముగిస్తే… కొన్ని రోజుల వరకూ ఇంటి వారందరూ కకావిక స్థితిని అనుభవించాల్సిందే. యంత్రాంగం నడిపించిన మనిషి దూర లోకాలకు వెళ్లిపోతే సంరాసం సారధ్యం అయోమయమే. రాజులేని రాజ్యంలో సైనికులే అధికారాలు ప్రదర్శిస్తారు. రాచరికాలు వెలగబెట్ట చూస్తారు. కుక్కల్లా కొట్లాడుకుంటారు. ఇంటి పరువును వీధికి లాగుతారు. మమతలను ముక్కలుగా కోసి వాటాలు పంచుకో చూస్తారు. ఇటువంటి స్థితిలో మునశ్శాంతి మరుగైపోయి మనసు చలించి పోతుంది. పోయిన వారితో మనం పోదామనిపిస్తుంది. అభద్రతా భావం హృదయాన్ని కుదించి వేస్తుంది. ఈ సమయంలో మనశ్శాంతి కోసం ఆత్మశక్తి కుదించి వేస్తుంది.
శివాలయంలో ఒక్కరోజైనా ఉండి వస్తే ధైర్యం లభిస్తుందని పరిస్థితులన్నీ చక్కబడి ప్రశాంతత దొరుకుతుందని పండితులు చెబుతారు. అందుకే శివాలయంలో దేవుని దగ్గర కూర్చొని ఆలోచించుకుంటే దేనికైనా దేవుడున్నాడులే అనే ధైర్యం వస్తుందట. మన వెనుక ఒకరున్నారనే భావన కల్గుతుందట. అందుకే ఇంటి పెద్ద మరణిస్తే శివాలయ నిద్ర చేయాలని చెబుతుంటారు. ఒకరే వెళ్లి చేయడం కంటే ఓ నలుగురిని వెంట తీసుకెళ్లి నిద్ర చేయడం శుభకరం అని మన వేద పండితులు సూచిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంట్లో ఎవరు చనిపోయినా పదకొండో రోజు నాడు శివాలయ నిద్ర చేయడం ఆనవాయితీగా వస్తోంది. కేవలం వ్యక్తి చనిపోయినప్పుడు కాదండోయ్… ఏడాదికి ఒకసారి శివాలయ నిద్ర చేస్తే కూడా చాలా మంచి జరుగుతుందట.