Kaikala Satyanarayana : ఆస్పత్రిలో కైకాల సత్యనారాయణ.. ఆరోగ్యంపై క్లారిటీనిచ్చిన కుటుంబ సభ్యులు..
Kaikala Satyanarayana : టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తెలుగు సినిమా రంగంలో ప్రఖ్యాత నటుడిగా పేరొందారు. వృద్ధాప్యం వల్ల సినిమాల్లో నటించడం తగ్గించేశారు కైకాల. ఇటీవల తన ఇంట్లో జారిపడ్డారు. అయితే, ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ శనివారం రాత్రి అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన్ను ఆయన కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.కైకాల ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇకపోతే వయసు పరిమితుల దృష్ట్యా కైకాల ఇంటికే పరిమితమయిన సంగతి తెలిసిందే.
కాగా, కైకాల చివరిసారిగా తెలుగు ప్రేక్షకులకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘మహర్షి’ సినిమాలో కనిపించారు. ఈ చిత్రానికి ముందర ఆయన నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్..కథానాయకుడు’ చిత్రంలో ఓ పాత్ర పోషించాడు. నవరస నటనా సార్వభౌమగా పేరుగాంచిన కైకాల సత్యనారాయణ.. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న నందమూరి తారకరామారావుకు డూప్‌గానూ నటించారు. దాదాపుగా 750 చిత్రాల్లో నటించిన కైకాల బహుముఖ ప్రజ్ఞాశాలి. నటుడిగానే కాకుండా కైకాల.. నిర్మాతగా, డైరెక్టర్‌గానూ చిత్రాలు చేశారు. రాజకీయాల్లోనూ కైకాల రాణించారు. పదకొండో లోక్ సభ సభ్యుడిగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి కైకాల సత్యనారాయణ ఎన్నికయ్యారు. తెలుగు దేశం పార్టీ తరఫున కైకాల పోటీ చేసి గెలుపొందారు. చాలా చిత్రాల్లో ఎన్టీఆర్ డూప్ వేషాలు వేసి కైకాల తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన ‘అపూర్వ సహస్ర శిరచ్ఛేద చింతామణి’ చిత్రంలో కైకాలకు అవకాశమిచ్చారు.
Kaikala Satyanarayana : బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల..
ఇక ఆ తర్వాత కైకాల వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వరుస సినిమాల్లో అవకాశాలు రాగా కైకాల పాత్రలను తనదైన శైలిలో పోషించి మంచి పేరు సంపాదించుకున్నాడు. విలన్ పాత్రలతో పాటు సపోర్టింగ్ రోల్స్ ప్లే చేస్తూ ముందుకు సాగాడు. పౌరాణిక పాత్రలు అయితే ఎన్టీఆర్ తర్వాత కైకాల సత్యనారాయణే అనేంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. పరమేశ్వురుడిగా, కర్ణుడిగా, భరతుడిగా, దుశ్శాసనుడిగా, ఘటోత్కచుడిగా, దుర్యోధనుడిగా, శ్రీకృష్ణదేవరాయుడిగా, యమధర్మరాజుగా, భీముడిగా, రావణుడిగా విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగు తెరపైన తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు కైకాల.