Manchu Vishnu : అధ్యక్షా మీకు టికెట్ల రేట్లతో సంబంధం లేదా?
Manchu Vishnu : ఏపీలో టికెట్ రేట్ల విషయమై సినిమా పరిశ్రమ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఏపీ లో ఉన్న టికెట్ల రేట్లు కారణంగా అక్కడ థియేటర్లను మూసుకోవలసిన పరిస్థితి ఉందంటూ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం పట్టుదలతో సామాన్యులకు అందుబాటులో ఉంచాలని టికెట్ల రేట్లను చాలా తక్కువ స్థాయికి తగ్గించడం జరిగింది అంటున్నారు. 1960 మరియు 70 ల్లో ఉన్న టికెట్ల రేట్లను ఇప్పుడు అమలు చేస్తున్నట్లు గా విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై ఎప్పుడూ ఇండస్ట్రీ గురించి పట్టనట్లు వ్యవహరించే రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించాడు.
ఆయన స్వయంగా అమరావతి వెళ్లి మంత్రి పేర్ని నాని తో చర్చించాడు. తద్వారా ఏమైనా ఫలితం ఉంటుంది ఏమో అని అంతా భావించారు. కానీ ఆయన చర్చల వల్ల ఏమీ జరగ లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా టిక్కెట్ల రేట్లపై సీఎం జగన్ మోహన్ రెడ్డితో చర్చించేందుకు అమరావతి వెళ్లారు. అక్కడ సుదీర్ఘంగా చర్చించిన చిరంజీవి ప్రభుత్వం త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమయంలో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు అయిన మంచు విష్ణు మాత్రం ఇప్పటి వరకు టికెట్ల విషయంలో కనీసం నోరు తెరచి మాట్లాడింది లేదు. ఆయన మా అధ్యక్షుడే కాకుండా ఒక నిర్మాత కూడా కనుక ఆయనకు ఏపీలో టికెట్ల రేట్లు విషయమై మాట్లాడాల్సిన బాధ్యత మరియు అర్హత రెండు ఉన్నాయి. కానీ ఆయన మాత్రం ఇప్పటికీ మౌనంగానే ఉన్నాడు.
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో మంచు విష్ణు కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకరకంగా చూస్తే ఇద్దరు బంధువులు కూడా… ఎన్నో విషయాల్లో జగన్ మోహన్ రెడ్డిని కలిసిన మంచు విష్ణు ఈ విషయంలో మాత్రం ఎందుకు కలిసి సినిమా పరిశ్రమ సమస్య ను గురించి తెలియ జేయడం లేదు అని సినీ వర్గాల వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సీఎం ను మా అధ్యక్షుడు కనీస బాధ్యత తో కలవడం లేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో మోహన్ బాబు ఒక లేఖను రాసి చేతులు దులిపేసుకున్నారు. అది కూడా జగన్మోహన్రెడ్డికి కాకుండా సినిమా ఇండస్ట్రీ వారికి ఆ లేఖను రాశారు. ఇండస్ట్రీ అందరం కలిసి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేద్దాం. అన్నట్లుగా మోహన్ బాబు ఆ లేఖలో పేర్కొన్నారు. మంచు ఫ్యామిలీ మొత్తం తాము ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం పెద్దగా స్పందిస్తూ ఉన్న దాఖలాలు లేవు.