Bats : గబ్బిలాలు తలకిందులుగానే నిద్రపోతాయెందుకు.. దానివెనక కారణాలేంటి..?
Bats : గబ్బిలాలు ఎగరగలిగే క్షీరదాలు. క్షీరదాల్లో గాలిలోకి ఎగిరేవి కేవలం గబ్బిలాలు మాత్రమే. ఇవి తమ నివాస ప్రాంతాల నుండి వేటకి వెళ్లే సమయంలో వాటి పిల్లలను పొట్టకి కరుచుకుని వెళ్తాయి. క్షీరదాలు కాళ్లతో నడవగలవు. పరిగెత్తగలవు. ఇతర పనులు కూడూ చేసుకుంటాయి. పక్షులు కూడా ముఖ్యంగా రెక్కలతోనే పైకి ఎగిరినప్పటికీ… అప్పుడప్పుడు వాటి కాళ్లను కూడా ఉపయోగిస్తాయి. చెట్టుపై నిలబడినప్పుడో.. లేదా ఏదైన కీటకాన్ని లేదా చిన్న ప్రాణులను వేటాడిన సమయంలోనో పక్షులు వాటి కాళ్లను వాడతాయి. కానీ క్షీరదం జాతికి చెందిన గబ్బిలాలు మాత్రం వాటి కాళ్లతో నడవలేవు. కనీసం నిలబడే శక్తి కూడా ఉండదు. చిన్న పాటి దూరం వెళ్లాలన్న గబ్బిలాలు ఎగిరే వెళ్తాయి. మరో ప్రత్యామ్నాయం వాటికి లేదు.
కాసేపు ఆగాలంటేవాటి రెక్కలకి ఉన్న గోళ్లతో చెట్టు కొమ్మనో, గోడ పగులునో పట్టుకని తలకిందులుగా వేలాడతాయి. తప్ప కాళ్లతో నిలబడలేవు.అలాగే గబ్బిలాలకు ఉండే రెక్కలూ కూడా వేరేలా ఉంటాయి. సాధారణ పక్షుల రెక్కలకు ఈకలు ఉంటే గబ్బిలాల రెక్కలకు మాత్రం ఈకలు ఉండవు. సన్నని పొర లాంటి చర్మం ఉంటుంది. గబ్బిలాల వేళ్లల్లో బొటన వేలు తప్పా.. మిగిలిన అన్ని వేళ్లూ గొడుగు ఊచల్లాగా పని చేస్తాయి. బొటన వేలు మాత్రం పైకి పొడుచుకు వచ్చినట్లుగా ఉండి చెట్టు కొమ్మలను, గోడ పగుళ్లను పట్టుకునేందుకు ఉపయోగపడుతుంది.గబ్బిలాలు పడుకునే సమయంలోనూ తలకిందులుగానే ఉంటాయి. కాళ్లతో కొమ్మలను పట్టుకుని తలను కిందికి వేలాడదీసి నిద్రిస్తాయి. గబ్బిలాలకు ఉండే కండరాల ప్రత్యేక నిర్మాణం ఇందుకు ఉపయోగ పడుతుంది.
గబ్బిలాల వెనక పాదాలు కండరాలకు ఎదురుగా పని చేస్తాయి. మోకాళ్లు వీపులా ఉంటాయి. అలాగే గబ్బిలాలు విశ్రాంతి తీసుకునేటప్పుడువాటి ప్రత్యేకమైన కండరాలు కాలి, కాలి వేళ్లను పట్టుకుంటాయి. దీని వల్ల అవి తలకిందులుగా పడుకునే సమయంలో వేలాడుతున్నప్పుడు ప్రత్యేకంగా కాలితో పట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు.మనుషులకు కానీ ఇతర పశు పక్షాదులకు కానీ తలక్రిందులుగా వేలాడదీస్తే… కొంత సమయం మాత్రమే అలా ఉండగలం. ఆ తర్వాత శరీరంలోని రక్తం అంతా తలలోకి వెళ్లి ఆగిపోతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ గబ్బిలాల విషయంలో అలాంటి ఇబ్బందులు ఏవీ ఉండవు. వాటి శరీర నిర్మాణం అలాగే ఉంటుంది. ఒక వేళ గబ్బిలం తలకిందులుగా వేలాడుతూ చనిపోయినా… అవి అలాగే ఉండిపోతాయి కానీ కింద పడవు.