Karimnagar.. మున్సిపల్ చట్టాన్ని తుంగలో తొక్కుతున్న రియల్టర్లు : కాంగ్రెస్ నేత రమేశ్ విమర్శ
పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో రియల్టర్లు 2019 మున్సిపల్ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని టీపీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ భూషనవేన రమేశ్ గౌడ్ విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమాలను అరికట్టాలని ఈ సందర్భంగా రమేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లో లే ఔట్ లేకుండానే కొంత మంది రియల్టర్లు వెంచర్స్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
అయితే, ఈ వెంచర్స్‌ను అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారులు అలా చేయొద్దని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు నిజాయితీగా వ్యవహరించి చట్టాన్ని ఉల్లంఘిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.