Crime News : వాట్సప్ లో వచ్చిన లింక్ క్లిక్ చేసింది.. అకౌంట్ లో ఉన్న 9 లక్షలు మాయం అయ్యాయి.. ఎక్కడంటే?
Crime News : ఓ మహిళ తన వాట్సప్ లో వచ్చిన ఓ లింక్ ను క్లిక్ చేసింది. అంతే.. తన అకౌంట్ లో ఉన్న 9 లక్షల రూపాయలు మాయం అయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. నిజానికి ఇది ఒక సైబర్ దాడి. ఒక మహిళను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆ మహిళ వాట్సప్ కు ఒక లింక్ పంపించారు. ఆ లింక్ క్లిక్ చేయగానే ఆ మహిళ అకౌంట్ నుంచి డబ్బులు మాయం చేశారు.
ఆ మహిళ బ్యాంక్ లో ఉద్యోగినిగా పని చేసి రిటైర్ అయ్యారు. తన పీఎఫ్ డబ్బులను ఓ బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసింది. తన అకౌంట్ కు సంబంధించి ఏదో ఫిర్యాదు చేసేందుకు బ్యాంక్ వెబ్ సైట్ కు వెళ్లి.. దాంట్లో ప్రయత్నించగా తనకు ఎర్రర్ వచ్చింది. దీంతో చాలా సార్లు ఆమె బ్యాంక్ వెబ్ సైట్ లో ప్రయత్నించినా కుదరలేదు కానీ.. చివరకు తన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలంటూ ఒక మెసేజ్ రావడంతో ఆమె తన ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేసింది. ఆ తర్వాత తనకు ఒక ఫోన్ వచ్చింది. తాము వాట్సప్ ద్వారా లింక్ పంపిస్తున్నామని.. మీరు ఫిర్యాదు చేయాలంటే ఆ లింక్ ద్వారా యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఫిర్యాదు చేయాలని చెప్పారు. దీంతో తను సరే అంది.
Crime News : ఫోన్ లో బ్యాంక్ ఖాతా వివరాలు తెలిపిన మహిళ
అయితే.. ఫోన్ లోనే బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పాలంటూ ఆ మహిళను అడగడంతో కొన్ని వివరాలు చెప్పింది. కానీ.. తనకు మధ్యలో అనుమానం వచ్చి అసలు ఫిర్యాదు ఎలా చేయాలి.. దాని ప్రాసెస్ చెప్పండి అంటూ అడిగింది. దీంతో తాము బ్యాంక్ అధికారులం అని తనను నమ్మించే ప్రయత్నం చేశారు దుండగులు. దీంతో వాళ్లను నమ్మిన ఆ మహిళ అన్ని వివరాలు చెప్పింది. ఆ తర్వాత వాట్సప్ లో వచ్చిన లింక్ క్లిక్ చేసి తన ఇంటర్నెంట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ను ఎంటర్ చేసింది. ఆ తర్వాత కొంత సేపటికే తన అకౌంట్ లో నుంచి 9 లక్షల డబ్బు మొత్తం డెబిట్ అయినట్టు ఎస్ఎంఎస్ వచ్చింది. షాక్ అయిన ఆ మహిళ వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్ కు కాల్ చేసింది. తను మోసపోయానని తెలుసుకుంది. సైబర్ నేరగాళ్లు తనను టార్గెట్ చేసి డబ్బు దోచుకున్నారని తెలుసుకొని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.