Summer : రోజురోజుకి నిప్పుల కొలిమిలా మారుతున్న తెలుగు రాష్ట్రాలు.. వడదెబ్బకి ఎంత మంది చనిపోయారంటే..!
Summer : ఎండలకి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో సూర్యుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. శుక్రవారం (మే3) ఏపీలోని నంద్యాల జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గోస్పాడు, బండి ఆత్మకూరు లో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ప్రకాశం జిల్లాలోని అర్ధవీడులో 47.3°C, వైయస్సార్ జిల్లాలోని చిన్నచెప్పలిలో 47.2°C,నెల్లూరు జిల్లాలోని వేపినాపి అక్కమాంబపురంలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Summer : భానుడి భగ భగ
ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మండుటెండలకు తోడు ఉక్కపోత కూడా ఎక్కువవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భానుడి భగభగలు.. వడగాలులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. . తెలంగాణలో కూడా సూర్యుడు నిప్పులవాన కురిపిస్తున్నాడు. పెద్దపల్లి, జగిత్యాల, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 46.7 డిగ్రీలు, నల్లగొండ జిల్లాలో 46.6 డిగ్రీలు, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో 46.5, మహబూబాబాద్, నారాయణపేట జిల్లాల్లో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.ఏపీలోనూ రికార్డు స్థాయి టెంపరేచర్స్ నమోదు అవుతున్నాయి.
ఏపీలోని ప్రకాశం జిల్లాలో 47 డిగ్రీలు, నంద్యాల జిల్లాలో 46.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లాలో 46.6 డిగ్రీలు, కడప జిల్లాలో 46.4 డిగ్రీలు, అనంతపురం, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. 14 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రకటించింది. మరో మూడు, నాలుగు రోజులపాటు ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది. ఎండల వలన కొందరు వడదెబ్బకి గురవుతున్నారు. గత మూడు రోజులుగా వడదెబ్బతో నలుగురు ఐదుగురు మరణించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాటిపై క్లారిటీ లేదు.