తాళి కడుతుండగా వధువు మృతి.. అయినా పెళ్లి మాత్రం జరిగింది…!
ప్రస్తుతం అసలే కరోనా రోజులు. అయినా కూడా కొందరు తప్పని పరిస్థితుల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మళ్లీ ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు లేకపోతే మళ్లీ చాలా రోజులు వెయిట్ చేయాలి కాబట్టి.. కొందరు బంధువులనే పిలుచుకొని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కరోనా కాలం అయినా కూడా ఎంతో కష్టపడి పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాక.. పెళ్లి సమయానికి.. వరుడు.. వధువు మెడలో తాళి కడుతాడు.. అనే సమయానికి.. వధువు కుప్పకూలిపోతే ఎలా ఉంటుంది? తను పెళ్లిపీటల మీదనే చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది? అటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని ఈత్వాలో చోటు చేసుకున్నది.
ఈత్వాకు చెందిన సురభికి.. మంజేష్ కుమార్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయం అయింది. పెళ్లి పనులు కూడా పూర్తయ్యాయి. పెళ్లి పీటల మీదికి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వచ్చి కూర్చున్నారు. పెళ్లి చేసే పూజారి.. మంత్రాలు చదువుతున్నాడు. వరుడు తాళిబొట్టు తీసుకొని వధువు సురభి మెడలో కట్టబోయాడు. అంతే.. అంతలోనే సురభి పెళ్లి పీటల మీదనే కుప్పకూలిపోయింది. దీంతో పెళ్లి కొడుకుతో సహా అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
పెళ్లి పీటల మీదనే గుండెపోటుతో మృతి చెందిన పెళ్లి కూతురు
అయితే.. వరుడు తాళి కట్టే సమయానికే పెళ్లి కూతురుకు గుండె పోటు రావడంతో.. అక్కడే కుప్పకూలిపోయింది వధువు. వెంటనే డాక్టర్ ను పిలిచినప్పటికీ.. అప్పటికే తను మృతి చెందినట్టు డాక్టర్ నిర్థారించడంతో.. పెళ్లి కూతురు తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే.. అక్కడికి వచ్చిన బంధువులు, పెద్దలు.. ఈ పెళ్లి ఎలాగైనా జరగాలని.. లేకుంటే మంచిది కాదని పెళ్లి కూతురు తరుపు వాళ్లకు చెప్పారు. దీంతో పెళ్లి కూతురు చెల్లి నిషాతో పెళ్లి కొడుకుకు పెళ్లి చేయాలని పెద్దలు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వాళ్లను ఒత్తిడి చేయడంతో.. చేసేది లేక.. పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు మృతదేహాన్ని పక్కనే పెట్టి.. ఆమె చెల్లె నిషా మెడలో తాళి కట్టాడు. పెళ్లి పూర్తి కాగానే.. సురభి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.