Etela Rajender : రాజీనామా వైపు ఈటల… వేడెక్కిన హుజురాబాద్ రాజకీయం…?
Etela Rajender : నేను కరోనా తగ్గే వరకు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను. ఈ సమయంలో రాజీనామా చేస్తే మళ్లీ ఉపఎన్నిక అంటారు? అసలే కరోనాతో జనాలు చచ్చిపోతున్నారు. కరోనా తగ్గాక రాజీనామా విషయం గురించి ఆలోచిస్తా.. అని ఈటల రాజేందర్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ మాత్రం.. హుజూరాబాద్ లో ఎంత త్వరగా ఉపఎన్నిక నిర్వహిస్తే అంత బెటర్ అన్న ఆలోచనలో ఉంది. ఎందుకంటే.. లేట్ అవుతున్నా కొద్దీ.. ఈటల రాజేందర్.. హుజూరాబాద్ ప్రజల మద్దతును కూడగట్టుకునే అవకాశం ఉందని పసిగట్టిన హైకమాండ్.. ఎంత త్వరగా రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అంత బెటర్ అన్న ఆలోచనలో ఉంది.
తనను భూకబ్జా వ్యవహారంలో ఇరికించినా.. మంత్రివర్గం నుంచి తొలగించినా.. తన ఎమ్మెల్యే పదవికి అయితే ఈటల రాజేందర్ రాజీనామా చేయలేదు. అలాగే.. వేరే పార్టీలోనూ చేరలేదు. దీంతో.. ఎలాగైనా ఈటల రాజేందర్ ను రెచ్చగొట్టి మరీ.. రాజీనామా చేసేలా చేయాలని టీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తోందట. అందుకే.. ఆ పార్టీకి చెందిన నేతలు, హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నేతలు.. ఈటలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నీకు దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలువు.. అప్పుడు నువ్వు నిజాయితీ పరుడివని ఒప్పుకుంటాం.. అని టీఆర్ఎస్ నేతలు బహిరంగంగా ఈటల రాజేందర్ కు సవాల్ విసురుతున్నారు.
Etela Rajender : హైకమాండ్ ఏం చెబితే అది చేస్తున్న మంత్రి గంగుల
ఇక.. అదే జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్.. హైకమాండ్ ఏది చెబితే అది చేస్తున్నట్టు తెలుస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా పనులు చక్కదిద్దుతున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోకి టీఆర్ఎస్ కు చెందిన ముఖ్యమైన నేతలందరినీ ఫస్ట్ తనవైపునకు తిప్పుకున్నారు ఈటల రాజేందర్. వాళ్లకు డబ్బు, పదవి, కార్ల ఆశ చూపి.. పార్టీ హైకమాండ్ వైపునకు తిప్పుకున్నారని.. ఇటీవలే ఈటల కూడా ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇక.. టీఆర్ఎస్ నేతలంతా ప్రెస్ మీట్లు పెట్టి మరీ.. ఈటల రాజేందర్ పై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల అనుకూల వర్గం, ఈటల వ్యతిరేక వర్గం అని రెండు వర్గాలుగా చీలిపోయాయట. అయితే.. ఓవైపు కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంటే.. టీఆర్ఎస్ నేతలు మాత్రం ఉపఎన్నిక అంటూ ఈటల రాజేందర్ ను పట్టుకొని వేలాడుతున్నారు. వీళ్లకు కరోనా భయం లేదా? ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే వీళ్లకు వీళ్ల రాజకీయాలే కావాల్సి వచ్చాయా? అంటూ ప్రజలు మండిపడుతున్నారు.