KCR : హైద్రాబాద్‌లో కేసీఆర్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.?
KCR : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత కొంతకాలంగా ఓ కొత్త జాతీయ రాజకీయ పార్టీని ప్రకటించాలనే ఆలోచనతో వున్న విషయం విదితమే. ‘జాతీయ రాజకీయాల్లోకి వెళదామా..’ అంటూ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే తెలంగాణ సమాజాన్ని అడిగారు కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నట్లు సంకేతాలు పంపారు, పంపుతూనే వున్నారాయన. అయితే, ఏళ్ళు గడుస్తున్నాయ్.. కానీ, కొత్త రాజకీయ పార్టీ విషయమై కేసీయార్ ఇదమిద్దమయిన ప్రకటన అయితే ఇంతవరకు చేయలేదు. భారత రాష్ట్ర సమితి అనీ, ఇంకోటనీ.. ఏవేవో పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి..
జాతీయ స్థాయిలో పలువురు రాజకీయ ప్రముఖులతో, పలువురు ముఖ్యమంత్రులతో కేసీయార్ మంతనాలు జరుపుతూనే వున్నారు. ఇంకా ఆలస్యం చేయడం వల్ల భవిష్యత్ రాజకీయ ప్రయోజనాలు దెబ్బ తినడం ఖాయమనే భావనతో వున్న కేసీయార్, వీలైనంత త్వరగా జాతీయ పార్టీని ప్రకటించేయాలనుకుంటున్నారట. బతుకమ్మ సంబరాల సమయంలోనో లేదంటే దసరా – దీపావళి మధ్యలోనో కేసీయార్ కొత్త జాతీయ పార్టీ ప్రకటన వుండబోతోందని తెలుస్తోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకునే పనిలో కేసీయార్ అండ్ టీమ్ వున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ పెట్టడమొక్కటే తక్షణ కర్తవ్యమనే భావనలో కేసీయార్ వున్నారట.
అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతగా వుంటూనే, ఫెడరల్ ఫ్రంట్‌కి నాయకత్వం వహించాలనుకున్నారు కేసీయార్. కానీ, అలా చేస్తే చాలా సమస్యలు వస్తాయనీ, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి అది కొత్త ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తుందని కేసీయార్ భావిస్తున్నారట. కలిసొచ్చే రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలతో హైద్రాబాద్‌లోనే ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, ఆ వేదిక మీదనే జాతీయ ప్రత్యామ్నాయంపై కేసీయార్ ప్రకటన చేయబోతున్నారన్నది తాజా ఖబర్.
అయితే, ఈ విషయమై గులాబీ వర్గాలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి.