Kurnool Politics : కర్నూలు రాజకీయాల్లో కుర్ర నేతల జోరు.. ఏ పార్టీ పట్టు సాధిస్తుందో?
ఆసక్తికరంగా కర్నూలు రాజకీయాలు
Kurnool Politics : కర్నూలు : కర్నూలు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ జిల్లాలో ఇటీవలి కాలంలో భారీగా రాజకీయ వారసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో జిల్లాలో కుర్ర నేతల జోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని కీలక నియోజకవర్గం ఆళ్లగడ్డకు చెందిన సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి కుమారుడు గంగుల ఫణికృష్ణారెడ్డి ఇప్పుడు రాజకీయ తెరంగేట్రానికి సిద్ధమైపోయారు. అయితే స్థానిక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఫణి ఎంట్రీ గంగుల ఫ్యామిలీకి కాకుండా వారి ప్రత్యర్థి వర్గమైన భూమా ఫ్యామిలీకి లబ్ధి చేకూరుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సోదరుల పిల్లల మధ్యే పోరు
ఆళ్లగడ్డ రాజకీయాల విషయానికి వస్తే.. అక్కడ గంగుల వర్సెస్ భూమా అన్న రీతిలో నిత్యం ఫైట్ జరుగుతూనే ఉంటుంది. దివంగత నేత భూమా నాగిరెడ్డికి ప్రత్యర్థి వర్గంగా మారిపోయిన గంగుల ఫ్యామిలీ ఇప్పుడు రెండుగా విడిపోయింది. గంగుల ప్రతాప్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నా.. రాజకీయంగా పెద్దగా యాక్టివ్ గా లేరు. అయితే ఆయన సోదరుడు గంగుల ప్రభాకర్ రెడ్డి మాత్రం ఇంకా యాక్టివ్ గానే ఉన్నారు. చాలా కాలం క్రితమే వైసీపీలో చేరిపోయిన ప్రభాకర్ రెడ్డి.. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇక 2019 ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి కుమారుడు బిజేంద్రనాథ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ వైపు వీచిన గాలిలో బిజేంద్రనాథ రెడ్డి విజయం సాధించగా.. ఆయనపై పోటీ చేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఓటమిపాలయ్యారు. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి యాక్టివ్ గా లేకపోయినా.. ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఫణికృష్ణారెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. అయితే రాష్ట్రంలో బీజేపీకి అంతగా బలం లేకపోవడంతో ఫణికృష్ణారెడ్డిని వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చేలా ప్రతాప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అంటే.. ఇప్పటికే ఎమ్మెల్యేగా గంగుల బిజేంద్ర కొనసాగుతుంటే.. కొత్తగా అదే ఫ్యామిలీకి చెందిన ఫణికృష్ణ కూడా అదే పార్టీలోకి చేరిపోతున్నారన్న మాట. మరి ఇద్దరూ ఒకే పార్టీలో ఉంటే.. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే టికెట్ కోసం అన్నాదమ్ముల మధ్యే పోరు తప్పనిసరి అని తెలుస్తోంది.
Kurnool Politics : అఖిల అందిపుచ్చుకుంటారా?
ఆళ్లగడ్డలో ఎప్పుడైనా గతంలో కాంగ్రెస్, టీడీపీలకు ఎలాగైతే సగం సగం ఓట్లు ఉంటూ వచ్చాయో.. ఇప్పుడు టీడీపీ, వైసీపీల మధ్య కూడా సగం సగం ఓట్లే ఉంటూ వస్తున్నాయి. అయితే ఎన్నికలప్పుడు పనిచేసే పలు కీలక పరిణామాలు గెలుపును నిర్ణయిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగూ బిజేంద్ర, ఫణికృష్ణలు వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించడం ఖాయమే. ప్రతాప్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిల మాదిరిగా వీరిద్దరూ సర్దుబాటు ధోరణిలో వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్న బిజేంద్ర తన సీటును త్యాగం చేసేందుకు సిద్ధపడరు. అదే సమయంలో బిజేంద్ర కంటే కాస్తంత యాక్టివ్ గా కనిపించే ఫణికృష్ణ ఎమ్మెల్యే సీటును వదులుకునే ప్రసక్తి కూడా కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనంగా ఇప్పుడు ఆళ్లగడ్డలో బిజేంద్ర కంటే కూడా ఫణికృష్ణ ఫ్లెక్సీలు, హంగామానే ఎక్కువగా కనిపిస్తోంది. అంటే.. వైసీపీ ఓట్లను వీరిద్దరూ చీల్చుకునే పనిని దిగ్విజయంగా కొనసాగిస్తారన్న మాట. టికెట్ దక్కేది ఒక్కరికే కాబట్టి.. ఇంకొకరు టికెట్ దక్కిన వారికి ఓట్లు పడకుండా పన్నాగం పన్నడం కూడా ఖాయమే. ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉండనున్న అఖిలప్రియకు ఇది కలిసివచ్చే అవకాశమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ అవకాశాన్ని ఏమేరకు అఖిల ఉపయోగించుకుంటారో వేచి చూడాల్సిందే.