Petrol Prices : పెట్రో ధరల్ని పెంచినవాళ్ళే తగ్గించాలి కదా.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Petrol Prices : పెట్రో ధరల్ని పెంచినవాళ్ళే తగ్గించాలి కదా.!

 Authored By prabhas | The Telugu News | Updated on :23 May 2022,9:30 pm

Petrol Prices : పెట్రో ధరల్ని పెంచేది కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే, ‘చమురు కంపెనీలు పెట్రో ధరల్ని రోజువారీగా సవరించే ల‌వీలు’ కల్పించింది కేంద్రమే. రాష్ట్రాలకు ఈ విషయంలో ఎలాంటి ప్రమేయమూ వుండదు. పెట్రో ఉత్పత్తుల అమ్మకాల ద్వారా కేంద్రానికి, రాష్ట్రానికి నిధులు సమకూరుతుంటాయి. వ్యాట్ సహా అనేక పన్నులు పెట్రో ఉత్పత్తుల మీద విధించబడుతున్న దరిమిలా, కేంద్ర రాష్ట్రాలు తదనుగుణంగా ఖజానా నింపుకుంటాయి. అయితే, పెట్రో ధరలు నరేంద్ర మోడీ హయాంలో అత్యంత దారుణంగా పెరిగిపోవడానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావమొక్కటే కారణం కాదు. కేంద్రం మోత మోగించిన పన్నుల వల్లనే ఇదంతా జరిగింది. సో, పెంచిన పన్నుల్ని కేంద్రం తగ్గించేస్తే.. రాష్ట్రాల్లో పెట్రో ధరలు సాధారణ స్థితికి వచ్చేస్తాయి.

ఎంత సాధారణ స్థితికి అంటే.. తెలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర కేవలం 70 నుంచి 75 రూపాయలకే పడిపోతుంది. కానీ, కేంద్రం పెట్రో ఉత్పత్తులపై పిండుకుంటోన్న పన్నుల్ని తగ్గించే ప్రసక్తే లేదు. ఇటీవల 8 రూపాయల మేర లీటర్ పెట్రోలుపై తగ్గించిన కేంద్రం, ఏకంగా లక్ష కోట్ల నష్టం వచ్చేస్తోందంటూ చెబుతోంది. ఆ లక్ష కోట్లను సమకూర్చుకునేందుకు ఏం అమ్మేస్తుందో మోడీ సర్కారుగానీ.. అలాక్కూడా దేశ ప్రజలకు నష్టమేనన్నమాట. మన్మోహన్ సర్కారు దిగిపోయి, మోడీ సర్కారు వచ్చాక.. దేశంలో జరిగిన అభివృద్ధి ఏంటి.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రపంచం సాధిస్తున్న ప్రగతిలో కొంత మేర మన భారతదేశం తాలూకు ప్రగతి కూడా వుంది. అంతే తప్ప, దేశం ప్రత్యేకంగా మోడీ హయాంలో సాధించిన ప్రగతి ఏమీ లేదన్నది విశ్లేషకుల మాట.

Petrol Prices Modi's Biggest Failure

Petrol Prices Modi’s Biggest Failure

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే, దాని వల్ల దేశంలో ఏ ఇతర రాష్ట్రానికీ నష్టం వుండదు. పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదాతో అభివృద్ధి చెందితే, ఆ ఫలాలు దేశమంతటికీ అందుతాయి.. దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక భూమిక పోషిస్తుంది. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వున్న సహజ వనరులు అలాంటివి. ఆంధ్రప్రదేశ్ అనే కాదు, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం దన్నుగా నిలిచినా ఇదే పరిస్థితి. చిన్న విషయాలు కావివి.. తెలుగు రాష్ట్రాల మీద కేంద్రం శీతకన్నేయడం దేశ ప్రగతికి కొంత మేర ఇబ్బంది కలిగిందన్న వాదనా లేకపోలేదు. చాలా రాష్ట్రాలు ఇదే తరహా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి మోడీ సర్కారు మాత్రం, ‘పెట్రో మోత’ అర్థం పర్థం లేకుండా మోగించేస్తూ, ఆర్థిక నష్టాలనీ ఇంకోటనీ కట్టు కథలు చెబుతూనే వుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది