TRS : నోరుజారుడు.. క్షమించమని అడుగుడు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పరిపాటి అయిందిగా?
ఏంటో ఈ టీఆర్ఎస్ నేతలు ఈమధ్య బాగా నోరు జారుతున్నారు. ఎప్పుడైతే దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు పార్టీ నేతలు కూడా పెద్దగా పార్టీని పట్టించుకోవడం లేదు. పార్టీ పరువును గంగలో కలిపేస్తున్నారు. ఏదో ప్రస్తుతం పార్టీకి గడ్డు పరిస్థితులు ఏర్పడితే ఇలాగేనా చేసేది. పార్టీ పరువును గంగలో కలుపుతూ.. సీఎం కేసీఆర్ కు లేనిపోని తలనొప్పులను తీసుకొస్తున్నారు.
ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలైతే ఆవేశపడి ఏదో అనేస్తున్నారు. తర్వాత సారీ చెబుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.. అయోధ్య రామాలయం విషయంలో నోరు జారి తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు. మతం గురించి నోరుజారడం అంటే అది చాలా డేంజర్. చాలా సెన్సిటివ్ ఇష్యూ అది. అన్ని తెలిసి తొందరపడి ఏదో ఒకటి అనేసి చివరకు క్షమాపణ చెబితే మాత్రం ఏంటి లాభం. పార్టీ పరువు గంగలో కలిశాక.. క్షమాపణ చెబితే పోయిన పరువు వస్తుందా?
క్షమాపణలు చెప్పిన లిస్టులో చల్లా ధర్మారెడ్డి కూడా?
చివరకు రాముడిని కూడా తమ స్వార్థం కోసం బీజేపీ వాడుకుంటోంది. రాముడిని రాజకీయాల్లోకి లాగి ఆయన్ను అపవిత్రం చేయకండి. అయోధ్య రామమందిరం నిర్మాణం పేరుతో దొంగ పుస్తకాలను పట్టుకొని చందాలు వసూలు చేస్తున్నారు. అసలు.. వీళ్లంతా వసూలు చేస్తున్న చందాలు ఎక్కడికి పోతున్నాయి.. అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాస్త ఘాటుగానే ప్రశ్నించారు. వరంగల్ లో జరిగిన ఓసీ మహాగర్జన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా ఆగ్రహానికి గురయ్యారు. హన్మకొండలో ఆయన ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. రచ్చ రచ్చ చేశారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అక్కడే నిరసన వ్యక్తం చేయడంతో.. తాను కావాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని.. తనపై కావాలని బురద జల్లుతున్నారని.. అయినప్పటికీ.. తన వల్ల ఎవరి మనసైనా గాయపడి ఉంటే క్షమించండి.. అంటూ ఆయన తాజాగా ప్రకటించారు.