Telangana Elections Results 2023 : బీఆర్ఎస్ దారుణ ఓటమికి ప్రధాన కారణాలు ఇవే.. ఆ విషయంలో కేసీఆర్ లెక్క తప్పింది
ప్రధానాంశాలు:
Telangana Elections Results 2023 : బీఆర్ఎస్ దారుణ ఓటమికి ప్రధాన కారణాలు ఇవే..
ఆ విషయంలో కేసీఆర్ లెక్క తప్పింది
Telangana Elections Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు .. తెలంగాణలో మరో శకం ప్రారంభమైంది. ఇన్ని రోజులు ఒక లెక్క.. ఇప్పుడు ఇంకో లెక్క అన్నట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించింది. రెండు సార్లు గెలిచి తెలంగాణలో చరిత్ర సృష్టించిన బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ చరిత్రను తిరగరాసింది. మామూలుగా కాదు.. బీఆర్ఎస్ ను కాంగ్రెస్ దారుణంగా ఓడించింది. ఇది ఒకరకంగా కేసీఆర్, కేటీఆర్ కు అవమానం అనే చెప్పుకోవాలి. ఎన్నికల ఫలితాలు లెక్కింపు ప్రారంభం వరకు కూడా తమదే మళ్లీ అధికారం అంటూ బీఆర్ఎస్ నేతలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. కానీ.. అసలు ప్రజలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారని ఫలితాలు వెలువడ్డాక తెలిసింది. అసలు బీఆర్ఎస్ ఇంత దారుణంగా ఎందుకు ఓడిపోయింది. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాం. ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకున్న పార్టీ ఎందుకు తెలంగాణ ప్రజలపై వ్యతిరేకత తెచ్చుకుంది. బీఆర్ఎస్ చేసిన బ్లండర్స్ ఏంటి.. తెలుసుకుందాం రండి.
బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం సంక్షేమ పథకాలే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు మంచివే. కానీ.. ఆ సంక్షేమ పథకాల ఫలాలు నిజంగా అసలైన లబ్ధిదారులకు చేరాయా? అంటే లేదనే చెప్పుకోవాలి. సంక్షేమ పథకాల ఫలాలు కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకే చేరడం, వాళ్లలే లబ్ధిదారులుగా చూపించి లబ్ధి పొందడం, బీఆర్ఎస్ నాయకులు, అనుచరులు.. వీళ్లే లబ్ధి పొందడం తీవ్ర అసంతృప్తికి కారణం అయింది.మరో కారణం నిరుద్యోగ సమస్య. తెలంగాణ వస్తే నిరుద్యోగం ఉండదని.. యువతకు ఉద్యోగాలు వస్తాయని అందరూ భావించారు. అందుకే చదువులు కూడా వదిలేసి తెలంగాణ యువత తెలంగాణ ఉద్యమ బాట పట్టారు. తెలంగాణ వచ్చాక తమ బతుకులు మారుతాయనుకున్నారు కానీ.. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అసలు నిరుద్యోగులను పట్టించుకోలేదు. లక్షల ఉద్యోగులు ఖాళీగా ఉన్నా సరైన సమయానికి నోటిఫికేషన్లు వేయలేదు. వేసినా పేపర్ లీకేజీలు, ఒకే పరీక్షను రెండు మూడు సార్లు నిర్వహించడం, ఒక్క పరీక్షను కూడా పారదర్శకంగా నిర్వహించి నియామకాలు చేసిన దాఖలాలు లేవు. దీంతో నిరుద్యోగ యువతలో ఒకేసారి ఉక్రోషం పుట్టుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది.
అధికార దాహం, అవినీతి మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఏదైనా ప్రాజెక్టు మొదలు పెడితే అందులో అవినీతి, అక్రమాలే ఎక్కువగా వెలుగు చూశాయి. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లోనూ భారీగా అవినీతి వెలుగు చూసింది. నాణ్యత లోపం రావడంతో బీఆర్ఎస్ అవినీతి బట్టబయలు అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదే డొల్లాతనం, అధికార పార్టీ నాయకులు అధికార దాహం, అవినీతి పార్టీపై వ్యతిరేకత పెరిగేలా చేశాయి.ధరణి పోర్టల్ లో ఉన్న అవినీతి కూడా మరో కారణం అని చెప్పుకోవచ్చు. అసైన్డ్ భూములు, పోడు భూముల్లో అవినీతి, రైతు బంధులో అవినీతి, ఇలా ధరణి పోర్టల్ మొత్తం అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు పార్టీ పేరు మార్చడం, పార్టీ పేరులో నుంచి తెలంగాణ తీసేయడం, టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చడం పెద్ద మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే.. తెలంగాణలో పాలన వదిలేసి మహారాష్ట్రలో పార్టీ రాజకీయాలు చేయడం, ఇక్కడి డబ్బులు తీసుకెళ్లి అక్కడ పెట్టడం ఏంటంటూ తెలంగాణ ప్రజలు మండిపడ్డారు. ఇలా అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలను బేరీజు వేసుకొని మరోసారి బీఆర్ఎస్ కు అధికారం ఇవ్వకూడదని భావించి కాంగ్రెస్ కు ఒక చాన్స్ ఇచ్చారు.