TTD CHAIRMAN : వైవీకి ప్రమోషన్.. టీటీడీ కొత్త చెర్మన్ గా ఎవరు…?
TTD CHAIRMAN: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి త్వరలో కొత్త చైర్మన్ రానున్నారు. ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం మరో పది రోజుల్లో (ఈనెల 21న) పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయన్నే కొనసాగిస్తారా లేక కొత్త వ్యక్తిని ఎంపిక చేస్తారా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయమేంటో తెలియదు గానీ ఆయనకు మాత్రం ఎంపీ కావాలనే కోరిక గతంలో బలంగా ఉండేది. 2019 లోక్ సభ ఎలక్షన్ లో వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు నుంచి బరిలో నిలవాలని గట్టిగా భావించినా కుదరలేదు. దీంతో ఆయన కొన్నాళ్లు కినుక వహించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావటంతో పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో ఆయన పార్టీలో మళ్లీ క్రియాశీలకం అయ్యారు.
మరోసారి భూమనకి..
టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం పూర్తి కానుండటంతో ఆయన స్థానంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి గతంలో ఒకసారి టీటీడీ చైర్మన్ గా వ్యవహరించారు. త్వరలో పునర్వ్యవస్థీకరించనున్న ఏపీ కేబినెట్ లో భూమన కరుణాకర్ రెడ్డికి బెర్త్ ఇచ్చే ఛాన్స్ లేకపోవంతో టీటీడీ చైర్మన్ గా రెండోసారి నియమించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్లు చెబుతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డికి వైఎస్సార్సీపీలో మంచి పేరుంది. అనాథ కరోనా శవాలకు సొంత డబ్బులతో తన చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపించినందుకు ఆయన్ని రీసెంటుగా ప్రధానమంత్రి కార్యాలయం కూడా మెచ్చుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఒకరు. పైగా ఆయన గతంలో టీటీడీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు పెద్దగా వివాదాలేమీ తలెత్తలేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే టీటీటీ ఛైర్మన్ పోస్ట్ భూమన కరుణాకర్ రెడ్డికే సెంట్ పర్సెంట్ దక్కనుందని తేల్చిచెబుతున్నారు.
వైవీ సుబ్బారెడ్డికి పదోన్నతి..: TTD CHAIRMAN
వైవీ సుబ్బారెడ్డిని పార్లమెంటులోని పెద్దల సభ(రాజ్యసభ)కు పంపనున్నట్లు తెలుస్తోంది. ఎగువ సభలో త్వరలో ఖాళీలు ఏర్పడనుండటం, ఆయన కూడా ఢిల్లీకి వెళ్లేందుకు ఉత్సాహంగా ఉండటంతో పదోన్నతి ఖాయమని సమాచారం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టినప్పటి నుంచి వైవీ సుబ్బారెడ్డి అందులో పని చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నారు. వయసులో పెద్దవాడు. కాబట్టి పెద్దల సభకు పంపటం సముచితంగా ఉంటుందనేది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసులోని మాటగా పేర్కొంటున్నారు.