Ysrcp : ఆ ఎమ్మెల్యేకి ప్రమోషన్ పక్కా.. ఇదీ వైఎస్ జగన్ లెక్క..
Ysrcp : జగన్ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కొత్తగా పలువురికి అవకాశం ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నా ఒక ఎమ్మెల్యేకి మాత్రం ప్రమోషన్ గ్యారంటీ అంటున్నారు. ఆయన పేరు గుడివాడ అమర్ నాథ్. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి శాసన సభ్యుడు. ఇతనిపై సీఎం జగన్ కి మొదటి నుంచీ గురి ఎక్కువ అని చెబుతున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. యువకుడు, చురుకైనవాడు కావటంతోపాటు విపక్షాన్ని విమర్శించటంలో, స్వపక్షాన్ని వెనకేసుకు రావటంలో దిట్ట అనే పేరు సంపాదించుకున్నాడు. గుడివాడ అమర్నాథ్ కి పదోన్నతి రానున్న విషయం ఇటీవలి అసెంబ్లీ సమావేశంలోనే తేలిపోయింది. ఎందుకంటే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ సర్కారు శాసన సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని సమర్థిస్తూ మాట్లాడే ఛాన్స్ ని ముఖ్యమంత్రి జగన్ గుడివాడ అమర్ నాథ్ కే ఇచ్చారు.
ఊహించని పరిణామం..
విశాఖపట్నం జిల్లాలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 15 కాగా అందులో 11 చోట్ల వైఎస్సార్సీపీవాళ్లే గెలిచారు. ఆ 11 మందిలో మిగతా 10 మందినీ కాదని జగన్ గుడివాడ అమర్ నాథ్ కే శాసన సభలో విశాఖ ఉక్కుపై మాట్లాడే అవకాశం ఇచ్చారు. సీనియర్లను పక్కనపెట్టి తొలిసారి ఎమ్మెల్యే అయిన అమర నాథ్ వైపే సీఎం మొగ్గుచూపారంటే ఆయనపై ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ అంశంపై మాట్లాడే ఛాన్స్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్న గాజువాక సెగ్మెంట్ శాసన సభ్యుడు తిప్పల నాగిరెడ్డికి రావాలి. కానీ రాలేదు. దీంతో గుడివాడ అమర్ నాథ్ కి ముఖ్యమంత్రి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారని ఎవరూ ఊహించలేదు.
తాత.. తండ్రి.. తాను..: Ysrcp
అమర్ నాథ్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంచి పేరు ఉంది. ఆయన తండ్రి, తాత కూడా మొదటిసారి శాసన సభ్యులుగా గెలిచి మినిస్టర్లు అయ్యారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ అమర్ నాథ్ రెడ్డి సైతం మంత్రిగా తన సత్తాను చాటుకోగలడనే విశ్వాసం సీఎం జగన్ లో కలిగింది. కమ్మ సామాజికవర్గం కూడా ఈయనకు కలిసొస్తోంది. తొలి మంత్రివర్గంలోనే అమర్ నాథ్ కి చోటు దక్కాల్సింది. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో అవంతి శ్రీనివాస్ కి అవకాశం వచ్చింది. విశాఖ జిల్లాలో వైఎస్సార్సీపీ భవిష్యత్తును పరిగణనలోకి తీసుకొని గుడివాడను మంత్రి చేయటం పక్కా అంటున్నారు. అతను కూడా అసెంబ్లీలో తనకు వచ్చిన అవకాశాన్ని బాగా వాడుకున్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ గవర్నమెంట్ ఆలోచనను ప్రజలకు ఆకట్టుకునేలా వివరించాడు. మంత్రిగానూ రాణించే లక్షణాలు అమర్ నాథ్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.