Uma Maheswari : వివేకా మీదనే ఎందుకు.? ఉమామహేశ్వరిపై ఎందుకు కాకూడదు.?
Uma Maheswari : బాబాయ్‌ని ఎవరు చంపారు.? అంటూ పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం పార్టీ అలాగే, జనసేన పార్టీ దుమ్మెత్తిపోయడం చూస్తూ వస్తున్నాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలు అరెస్టులు కూడా జరిగాయి. నిజానికి, అత్యంత సంక్లిష్టమైన కేసు ఇది. చంద్రబాబు హయాంలో జరిగిన హత్యకు సంబంధించి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ, జనసేన ఆరోపణలు చేయడం శోచనీయమే. ఇటీవల స్వర్గీయ నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత దీన్ని సహజ మరణంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత అది ఆత్మహత్య అని తేలింది.
తాజాగా, ఉమామహేశ్వరి ఆత్మహత్య వెనుక కుటుంబ తగాదాలు, ఆస్తి సంబంధిత వ్యవహారాలు వున్నాయంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయినట్లు తొలుత వార్తలు రాగా, ఆ తర్వాత అది గుండె పోటు అని తేలింది. దానిపై టీడీపీ నానా యాగీ చేస్తోన్న సంగతి తెలిసిందే. మరి, ఉమామహేశ్వరి విషయంలో కూడా అలాగే మాట మారింది కదా.? ఇక్కడ కుటుంబ తగాదాలు, ఆస్తి గొడవలన్న ఆరోపణలు వస్తున్న దరిమిలా, తెలుగుదేశం పార్టీ ఏం సమాధానం చెప్పగలుగుతుంది.? హూ కిల్డ్ బాబాయ్.. అంటూ టీడీపీ అప్పట్లో వైసీపీ మీద వెటకారం చేసింది. ‘హూ కిల్డ్ పిన్ని’ అంటూ ఇప్పుడు టీడీపీ మీద వైసీపీ ర్యాగింగ్ చేస్తోంది. నిజాలు నిగ్గు తేలాలంటే ఉమామహేశ్వరి కేసు కూడా సీబీఐకి అప్పగించాలేమో..
అన్న డిమాండ్లు కూడా వస్తుండడం గమనార్హం. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కారణంగానే ఉమామహేశ్వరి బలవన్మరణానికి పాల్పడ్డారని వైసీపీ నేత ఒకరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హెరిటేజ్ సంస్థ వాటాలు, భూములకు సంబంధించిన వివాదలంటూ సోషల్ మీడియాలో చాలా అనుమానాలు వ్యక్తమవుతుండడాన్ని వైసీపీ నేతలు ప్రస్తావిస్తుండడం గమనార్హం. ఇంత జరుగుతున్నా, టీడీపీ అనుకూల మీడియా ఈ అనుమానల కోణంలో ఎలాంటి వార్తలూ వెలుగులోకి తీసుకురావడంలేదు.