AP Cabinet: కేబినెట్ బెర్తుల కోసం భారీ క్యూ.. ఊహించని నేతలకు దక్కనున్న మంత్రి పదవి?
ఆ జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలను కేబినెట్ బెర్త్ ఊరిస్తోంది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై అప్పుడే ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారట. అయితే ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉండడంతో.. జిల్లాలో ఉన్న సమీకరణాల వల్ల ఎవరూ గట్టి నమ్మకానికి రాలేకపోతున్నారని కేడర్ చెబుతోంది. నెల్లూరు నుంచి అనిల్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి కేబినెట్‌లో ఉన్నారు. వీరిద్దరూ సేఫ్‌జోన్‌లోనే ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరిని మార్చకుండా కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా? అలా ఇస్తే ఎవరికి పదవీయోగం ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కేబినెట్‌లో చోటు ఆశిస్తున్నవారిలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్దన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఉన్నారు. వీరిలో తొలి విడతలోనే మంత్రి పదవి ఆశించి, భంగపడ్డారు కాకాణి. ప్రస్తుతం శాసనసభ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈ దఫా తప్పకుండా కేబినెట్‌లో చోటు కల్పిస్తారని కాకాణి వర్గం ఆశలు పెట్టుకుందని వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
ఎవరికి వారే .. ధీమా
పార్టీ పెద్దలతో ఉన్న పరిచయాలు.. ప్రత్యర్థులపై ఆయన విరుచుకుపడే శైలి.. మొదటి నుంచి జగన్‌కు మద్దతుగా ఉండటం కలిసొచ్చే అంశాలుగా లెక్కలేసుకుంటున్నారు. ఇక సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎస్సీ కోటాలో మంత్రి పదవి తప్పకుండా వస్తుందని కోటి ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది. మేకపాటి కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఈ విషయంలో అక్కరకు వస్తాయని అనుకుంటున్నారు. ఇటీవల తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో సూళ్లూరు పేట నుంచి భారీ మెజారిటీ రావడం,.. మున్సిపల్ ఎన్నికల్లో సూళ్లూరుపేట, నాయుడుపేట పురపాలక సంఘాల్లో వైసీపీ జెండా రెపరెపలాడించడం ప్లస్ పాయింట్లుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే రేసులో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా ఉండడంతో, పోటీ రసవత్తరంగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. వచ్చే రెండున్నరేళ్లూ వైసీపీకి కీలకమని, సీనియర్ నేత కావడంతో, బెర్త్ ఉంటుందని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అనం.. నల్లపురెడ్డి మధ్యే
అయితే గతంలో ఆనం చేసిన కామెంట్స్‌ను పక్కన పెట్టి మంత్రిని చేస్తారా అనే అనుమానం పార్టీ కేడర్ లో వ్యక్తమవుతోంది. ఇక కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సైతం మంత్రి పదవి ఆశిస్తున్నవారిలో ఉన్నారు. వైసీపీ ఏర్పడిన తర్వాత మొదటి ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మకాగా, రెండో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి. ఆది నుంచి వైఎస్ జగన్ వెంటే ఉన్న ఆయన తొలి దఫాలోనే మంత్రి పదవి రావాల్సి ఉండగా, రాజకీయ సమీకరణాల రీత్యా రాలేదు. దీంతో ఈదఫా కేబినెట్‌లో బెర్త్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జిల్లా నుంచి కేబినెట్‌లో ఉన్నవారిని కదల్చకుండా, కొత్తవారికి ఛాన్స్ ఇస్తారా అన్నదే కీలకంగా మారింది. నెల్లూరులో రెడ్డి వర్గానికి మంత్రి పదవి తప్పనిసరి.. దీంతో ఇప్పుడున్న గౌతం రెడ్డి స్థానంలో మరొకరికి ఛాన్స్ దొరకవచ్చన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు కొన్ని జిల్లాల్లో ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. ఆ లెక్కన చూసుకుంటే, నెల్లూరుకు మరో మంత్రి పదవి వచ్చే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. మరి ఆ స్థానం ఎవరిదన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.
ఇది కూడా చదవండి ==> అమరావతి రాజధాని భూముల కుంభకోణం.. అసలు కథ నడిపిన పెద్ద తలకాయ ఆయనేనా?..
ఇది కూడా చదవండి ==> Ysrcp : మంత్రి పదవుల కోసం ఆశపడితే… ఉన్నది కాస్తా పాయే…!
ఇది కూడా చదవండి ==> వంగవీటి ఇప్పటికైనా కుదురుకునేనా..?