జేసీ బ్రదర్స్ ఇంత దారుణమైన స్థితిలో ఉన్నారా.. ?
అనంతపురంలో జేసీ బ్రదర్స్ హవా గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయంగా ఆయా నేతలకు ఢీ కొట్టగలిగే వాళ్ళు ఎవరు లేరని చెప్పేవాళ్ళు, అయితే ఇదంతా గత చరిత్ర ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నటంతో జేసీ సోదరుల ఆటలు సాగటం లేదు. తాజాగా తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అనుమతించాలని కోరుతూ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో నలుగురు ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పత్రాలను చింపేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు …తాడిపత్రిలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన జేసీ ప్రభాకర్‌రెడ్డి అబద్ధానికైనా నామినేషన్ వేయలేకపోయామని చెప్పడం అవమానంగా ఉందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఒకప్పుడు జేసీ సోదరులకు వ్యతిరేకంగా ఎవరైనా నామినేషన్స్ వేయాలంటే భయపడేవారు. అలాంటి సొంత ఇలాకా లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయడానికి నామినేషన్స్ కూడా వేయలేని దారుణమైన స్థితికి జేసీ సోదరులు పడిపోయారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఎన్నికలో తనను నామినేషన్స్ వేయకుండా అడ్డుకున్నారు అంటూ జేసీ కోర్టుకు వెళ్ళటం అంటే తన అసమర్థత, చేతకాని తనాన్ని బలమైన నేతగా గుర్తింపు పొందిన జేసీ ప్రభాకర్‌రెడ్డి తనకు తానుగా చెప్పుకున్నట్టుగా ఉందనే ఆవేదన ఆయన వర్గీయుల్లో కనిపిస్తోంది.
అయన కోర్టుకు వెళ్లటాన్ని ఎవరు తప్పుపట్టరు, ఇందులో తప్పులేదు. ముఖ్యంగా గొంతులేని వారి గొంతుకగా న్యాయస్థానాన్ని పిలుచుకుంటారు. పాలకులు, ధనవంతులు, సమాజంలో వివిధ రకాల పలుకుబడి ఉన్న వారు తమ హక్కులను కాల రాస్తున్నప్పుడు పేదలు, అణగారిన వర్గాల వారు తమ ఏకైక దిక్కుగా న్యాయస్థానాలను మాత్రమే నమ్ముతారు. అంటే నిస్సహాయులు, అభాగ్యులు తమ చిట్ట చివరి ప్రయత్నంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. కానీ జేసీ ప్రభాకర్ అంత నిస్సహాయుడు, అభాగ్యుడు కాదు..