New Year 2025 : ఒక్కరోజే వెయ్యి కోట్ల మద్యం అమ్మకాల అంచనా !
ప్రధానాంశాలు:
New Year 2025 : నయా సాల్ జోష్.. ఒక్కరోజే వెయ్యి కోట్ల మద్యం అమ్మకాల అంచనా !
New Year 2025 : న్యూ ఇయర్‌లోకి అడుగు పెట్టేందుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ప్రపంచమంతటా సంబరాలు అంబరాన్నిఅంటుతాయి. తెలంగాణలో ఈసారి డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ సందర్భంగా భారీగా మద్యం అమ్మకాలు ఉంటాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఒక్కరోజే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి. గడిచిన మూడు రోజుల్లో దాదాపు రూ. 565 కోట్ల విలువైన మద్యం లిస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే మద్యం స్టాక్ డిపోల నుంచి వైన్ షాపులు, బార్లకు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2, 620 మద్యం దుకాణాలు ఉండగా 19 మద్యం డిపోల ద్వారా ప్రభుత్వం లిక్కర్ సరఫరా చేస్తోంది. డిసెంబర్ 31న మద్యం దుకాణాలు అర్థరాత్రి 12 గంటల, బార్లు, రెస్టారెంట్లు అర్థరాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే, ఈ వేడుకల సందర్భంగా డ్రగ్స్ వాడకంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ముఖ్యంగా GHMC అధికార పరిధిలో ఈవెంట్‌లు మరియు పార్టీలపై అధిక నిఘా ఉంచాలని అధికారులను కోరింది. ఈ నిర్ణయాన్ని మద్యం విక్రేతలు స్వాగతించారు.
రాష్ట్రానికి గణనీయమైన ఆదాయాన్ని సమకూరుస్తుందనే అంచనాలతో. భద్రత మరియు సమ్మతిని నిర్ధారించడంతో పాటు వేడుకలను సజావుగా నిర్వహించడం ప్రభుత్వ చర్య లక్ష్యంగా చేసుకుంది. ఇక ఏపీలోనూ కొత్త ఏడాది జోష్ కొనసాగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త బ్రాండ్లను అందుబాటులోకి తేవటమే కాకుండా రూ. 99కే మద్యాన్ని అందుబాటులోకి తేవడంతో మద్యం ప్రియులు న్యూ ఇయర్ వేడుకలను ఉత్సాహంతో చేసుకోనున్నారు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం ప్రియులు మందులో మునిగి తేలేందుకు రెడీ అయ్యారు. ప్రధాన పట్టణాలు, నగరాల్లో న్యూ ఇయర్ జోష్ ఇప్పటికే మొదలైంది.