Kondapolam Movie Review : కొండపొలం మూవీ రివ్యూ
Kondapolam Review : వైష్ణవ్ తేజ్.. కొండపొలం సినిమా రివ్యూ కొందరు దర్శకులు సినిమా తీయడానికి కొన్ని సంవత్సరాలు తీసుకుంటారు. రాజమౌళి లాంటి దర్శకుడు అయితే ఒక సినిమాకు కనీసం 2 నుంచి 3 ఏళ్లు తీసుకుంటాడు. పూరీ లాంటి దర్శకులు అయితే.. మూడు నాలుగు నెలల్లో ఓ సినిమాను రిలీజ్ చేస్తుంటారు. సినిమాను తీయడంలో ఎవరి ప్రత్యేకత వారిదే. తాజాగా ఈరోజు విడుదలైన కొండపొలం సినిమా కూడా అటువంటిదే. ఎందుకంటే.. ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు కూడా చాలామందికి ఈ సినిమా గురించి తెలియదు. సినిమా గురించి ఎటువంటి ప్రచారం లేకుండా.. సైలెంట్ గా సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు.
కొండపొలం అనే ఈ సినిమా కొండపొలం అనే ఓ నవల ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఈ సినిమాలో ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించగా.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. కోట శ్రీనివాసరావు, సాయిచంద్, హేమ, అంటోని, రవిప్రకాశ్, మహేశ్ విట్ట, రచ్చ రవి, అశోక్ వర్థన్ లాంటి పలువురు నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు.ఈ సినిమాకు దర్శకత్వం వహించింది క్రిష్ జాగర్లమూడి. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. ఇక.. ఈ సినిమా కథ ఏంటో తెలుసుకుందాం.
కథ : ఈ సినిమా కథ.. పూర్తిగా కొండపొలం నవల నుంచి తీసుకున్నదే. ఆ నవల గురించి.. దాని ప్రత్యేకత గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ.. ముందు సినిమా కథ ఏంటో తెలుసుకుందాం. రాయలసీయలోని కడప జిల్లాకు చెందిన రవీంద్ర యాదవ్(మన హీరో వైష్ణవ్ తేజ్) అనే యువకుడికి సంబంధించిన కథే ఈ సినిమా. తన చదువు పూర్తయ్యాక.. ఉద్యోగం కోసం రవీంద్ర హైదరాబాద్ వెళ్తాడు. కానీ.. సరైన ఉద్యోగం దొరకదు. దీంతో.. తిరిగి తన ఊరి బాట పడతాడు. తన ఊరికి వెళ్లినప్పుడు తన తాత రోశయ్య(కోట శ్రీనివాసరావు) తనకు ఒక విషయం చెబుతాడు.
ప్రస్తుతం ఊళ్లో కరువు తాండవిస్తోందని.. ఊరిలో ఉన్న గొర్రెలతో గ్రామస్థులంతా కలిసి కొండపొలం చేస్తున్నాని.. అందుకే.. తమ గొర్రెలను తీసుకొని వాళ్లతో పాటు వెళ్లి కొండపొలం చేయాలంటూ రోశయ్య.. తన మనవడికి సలహా ఇస్తాడు. దీంతో వాళ్ల గొర్రెలను తీసుకొని రవీంద్ర అడవికి వెళ్తాడు. అక్కడికి వెళ్లాక రవీంద్రకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అవుతాయి. అక్కడ ఏం నేర్చుకుంటాడు. తన గొర్రెల మందను ఎలా కాపాడుకుంటాడు. ఓబులమ్మ(రకుల్ ప్రీత్ సింగ్) తన జీవితంలోకి ఎలా ప్రవేశించింది.. అనేదే మిగితా కథ.
కొండపొలం నవల గురించి కొండపొలం నవలను ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించాడు. ఆ నవలకు తానా సంస్థ నిర్వహించిన పోటీలో ప్రథమ స్థానం లభించింది. అలాగే డబ్బు కూడా గెలుచుకుంది.
ప్లస్ పాయింట్స్ : ఈ సినిమాకు ప్లస్ పాయింట్ హీరో వైష్ణవ్ తేజ్. ఒక పల్లెటూరు యువకుడిలా తన పాత్రలో వైష్ణవ్ ఒదిగిపోయాడు. తన గొర్రెల మందను పులుల నుంచి రక్షించుకోవడం చేసిన పోరాటాలు వీరోచితంగా ఉంటాయి. వైష్ణవ్ తర్వాత తన పాత్రకు ఓబులమ్మ న్యాయం చేసింది. అడవికి వచ్చిన సమయంలో ఎంతో పిరికివాడిగా ఉన్న రవీంద్రలో ధైర్యాన్ని నూరిపోయడం, అతడిలో పట్టుదల వచ్చేలా చేయడం అన్నీ తను అవలీలగా చేసింది. కోట శ్రీనివాసరావుతో పాటు.. మిగితా నటులు అందరూ తమ పాత్రల మేరకు నటించి ఒప్పించారు. అడవి నేపథ్యంలో వచ్చే సినిమా కావడం.. ఒక నెల రోజుల పాటు అడవిలో ఉండి.. తమ గొర్రెలకు గ్రాసం అందించలేక.. తాము సరైన ఆహారం తినలేక.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. అనే కాన్సెప్ట్ కొత్తగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది.
ఈ సినిమాలోని మాటలు కూడా అద్భుతంగా, ఆలోచింపజేసేలా ఉంటాయి. అడవి నేర్పే పాఠాలు కావచ్చు.. అడవితో మనిషికి ఉండే బంధం కావచ్చు.. మనుషులకు, పశువులకు మధ్య ఉండే బంధం కావచ్చు.. అన్నింటినీ ఈ సినిమాలో చక్కగా చూపించారు.
మైనస్ పాయింట్స్ : ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉంటాయి. ఇది కమర్షియల్ సినిమా కాకపోవడం.. సినిమా ఎక్కువ భాగం అడవిలో సాగడమే ఈ సినిమాకు మైనస్. అలాగే.. ఈ సినిమాలో అంతగా ఆశించిన స్థాయిలో వీఎఫ్ఎక్స్ ఉండవు. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్లినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్లు అవసరం లేకున్నా.. ఇరికించినట్టుగా అనిపిస్తుంది. ఎడిటర్ కొన్ని సీన్లను సెకండ్ హాఫ్ లో కట్ చేస్తే బాగుండేది.
కన్ క్లూజన్ : మొత్తం మీద.. అడవి మీద ప్రేమ ఉన్నవాళ్లు.. కమర్షియల్ కాకుండా.. ప్రకృతితో కాసేపు మమేకం అయి.. ఓ రెండు గంటలు ఎంజాయ్ చేయాలనుకునేవాళ్లు ఈ సినిమాకు నిరభ్యంతరంగా వెళ్లొచ్చు.
ది తెలుగు న్యూస్ రేటింగ్ : 3.25/5