Ravi Shastri : విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచిన రవిశాస్త్రి.. వారిపై సంచలన వ్యాఖ్యలు..
Ravi Shastri : టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వివాదంపై మాజీ క్రికెటర్స్ పలు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ఈ విషయమై రవిశాస్త్రి స్పందించారు. కెప్టెన్సీ నుంచి వైదొలగడం విరాట్ కోహ్లీ నిర్ణయమని, ఆ నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరు గౌరవించాల్సి ఉంటుందని చెప్పారు రవిశాస్త్రి. కెప్టెన్సీ ఉన్నా లేకపోయినా..కోహ్లీ ఆటతీరులో పెద్ద తేడా ఉండదని పేర్కొన్నాడు.సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి పాలయినంత మాత్రాన ఐదేళ్లుగా నెంబర్ వన్‌గా ఉన్న టీమ్..ఒక్కసారిగా పడిపోయిందని చెప్పడం మంచిది కాదని అన్నాడు. ప్రతీ విషయానికి కాలమే సమాధానం చెప్తుందని తెలిపాడు.
టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు ముందర బీసీసీఐ, కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించగా, ఆయన గాయాల కారణంగా దూరం అయ్యాడు. దాంతో కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇకపోతే కెప్టెన్ ట్యాగ్ లేకుండా వన్డే సిరీస్ ఆడిన కోహ్లి..వరుసగా మూడు మ్యాచ్ లలో 79, 0, 65 పరుగులు చేశాడు.కొంత మంది మాజీ క్రికెటర్స్ కోహ్లీకి వ్యతిరేకంగా మాట్లాడగా, రవిశాస్త్రి మాత్రం కోహ్లీకి అండగా నిలిచాడు. ఓ ఆటగాడి సామర్థ్యాన్ని అతని ఆటను బట్టి లెక్కించాలని, ప్రపంచకప్‌లతో కాదని రవిశాస్త్రి వివరించాడు.
Ravi Shastri : ఆయన నిర్ణయాన్ని గౌరవించాలంటున్న రవిశాస్త్రి..
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆరు ప్రపంచకప్‌ల తర్వాత మెగా టోర్నీ టైటిల్ అందుకున్నాడని, భారత దిగ్గజ క్రికెటర్లుగా చెప్పుకునే సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ అసలు ప్రపంచకప్‌లే గెలవలేదని గుర్తుచేశాడు. అంతమాత్రాన వాళ్లు చెత్త ఆటగాళ్లు అవుతారా? అని రవిశాస్త్రి ప్రశ్నించాడు. టీమిండియా తరఫున ప్రపంచకప్ గెలిచిన సారథులు ఇద్దరే ఉన్నారని తెలిపాడు. టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి రెండు పర్యాయాలు కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి పని చేశాడు.