Teenmaar Mallanna : కవిత ఇక కాస్కో తేల్చుకుందాం… తీన్మార్ మల్లన్న సవాల్
Teenmaar Mallanna : తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై కవిత అనుచరులు దాడి చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తనపై ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నం జరిగిందని, ఈ దాడికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరియు ఆమె అనుచరులు కారణమని ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. తన ఆఫీసులో దాడి జరిగిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ దాడిలో తనకు గాయమైందని, ఆఫీసులో బీభత్సం సృష్టించారని తెలిపారు.
తాను చేస్తున్న బీసీ ఉద్యమాన్ని ఆపాలని భావించి ఈ దాడికి పాల్పడ్డారని మల్లన్న ఆరోపించారు. “నాపై దాడి చేస్తే ఉద్యమం ఆగిపోతుందనుకోవడం భ్రమ” అని స్పష్టం చేశారు. గన్ మెన్ వద్ద ఉన్న తుపాకీని లాక్కుని తన సిబ్బందిపై దాడి చేశారని, ఆఫీసులో ఉన్న ఫర్నీచర్ ధ్వంసం చేసి, అద్దాలు పగలగొట్టారని తెలిపారు. తనతో పాటు కొందరు సిబ్బంది కూడా గాయపడ్డారని పేర్కొన్నారు. కవిత కుటుంబం తనపై హత్యాయత్నానికి పాల్పడిందని, అయినా తన ఉద్యమం ఆగదని, తాను వెనుకడుగు వేయనని తీన్మార్ మల్లన్న తేల్చిచెప్పారు.

Teenmaar Mallanna : కవిత ఇక కాస్కో తేల్చుకుందాం… తీన్మార్ మల్లన్న సవాల్
ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, న్యాయం తప్పకుండా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సహచర ఎమ్మెల్సీపై దాడి చేసిన కవితకు ఎమ్మెల్సీ పదవిని కొనసాగించే అర్హత లేదని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. “కవిత తన ఉనికి కోసం కేసీఆర్‌ను ప్రశ్నించాలి, కేటీఆర్‌తో పోరాడాలి. కానీ తోటి ప్రజాప్రతినిధులపై దాడి చేయడం సరికాదు,” అంటూ మల్లన్న విమర్శలు గుప్పించారు.