AP : అటాక్.. కౌంటర్ అటాక్.. అట్టుడుకుతున్న ఏపీ పాలిటిక్స్.. పై చేయి ఎవరిదో?
AP : ఏపీ రాజకీయాలు ప్రస్తుతం బాగా హీటెక్కాయి. అధికార వైసీపీ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీయైన టీడీపీ ఆఫీసులపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో దాడులను నిరసిస్తూ చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తున్నారు. కాగా, టీడీపీ వారు ముఖ్యమంత్రిని తూలనాడారని, బూతులు తిట్టారని పేర్కొంటూ.. కౌంటర్ అటాక్‌గా.. వైసీపీ కూడా దీక్షలకు సిద్ధమవుతున్నది. మొత్తంగా ఏపీ రాజకీయం అప్పుడే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.వైసీపీ కార్యకర్తలు టీడీపీ అధికార ప్రతినిధి ఇంటిపైన, టీడీపీ ఆఫీసులపైన దాడి చేసి ఫర్నీచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయాలపై కేంద్ర హోం శాఖకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయబోతున్నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు.
ఈ క్రమంలోనే ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరిట 36 గంటల నిరసన దీక్షలో కూర్చున్నాడు. ఈ దీక్ష ద్వారా టీడీపీ తిరిగి ప్రజాప్రస్థానంలోకి తీసుకెళ్లాలని, అధికార వైసీపీని దెబ్బకొట్టాలని తెలుగు దేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. టీడీపీని తుదముట్టించడం ఎవరి వల్ల కాదని చెప్తున్నారు. అధికార వైసీపీని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని డైరెక్ట్‌గా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే బీజేపీతో దోస్తీకి కూడా సిద్ధమయ్యే మాస్టర్ ప్లాన్ చంద్రబాబు వేస్తున్నట్లు సమాచారం. కాగా, టీడీపీ నేతలే కావాలని సీఎం జగన్‌ను దూషించారనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకుగాను వైసీపీ ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే ‘జనాగ్రహ దీక్ష’ పేరిట ప్రజలే ప్రతిపక్షంపై తిరగబడాలన్న భావనను జనంలో తీసుకొచ్చేందుకుగాను వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ కూడా స్పందించారు.
AP : ఎన్నికల కురుక్షేత్రంలో తలపడేందుకు సిద్ధమవుతున్న వైసీపీ, టీడీపీ..
తమ వారు అధికారంలో లేరనే అక్కసుతోనే ముఖ్యమంత్రిని ఉద్దేశించి బూతులు తిడుతున్నారని, ఇది కరెక్టేనా? అనే ఆలోచన చేయాలని జగన్ సూచిస్తున్నారు. రాష్ట్రంలో భావోద్వేగాలు పెంచి గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారంటూ పరోక్షంగా టీడీపీని ఉద్దేశించి జగన్ కామెంట్ చేశారు. మొత్తంగా ఏపీ పాలిటిక్స్ ఎన్నికలకు ముందరే అనగా రెండేళ్ల ముందరే బాగా హీటెక్కాయి. టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ ఫైట్ మహా రంజుగా సాగుతున్నది.