Telangana Assembly Elections 2023 : ఎన్నికల కోడ్ అంటే ఏంటి? ఎన్నికల కోడ్ అమలులో ఉంటే ఏం చేయకూడదు? రూల్స్ ఏంటి?
Telangana Assembly Elections 2023 : తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది. తెలంగాణ మాత్రమే కాదు.. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మొదలైంది. నవంబర్ నెలలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ సోమవారం నుంచే అమలులోకి వచ్చింది. ఎందుకంటే.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. తెలంగాణలోనూ అక్టోబర్ 9 నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. అసలు ఏంటి ఈ ఎన్నికల కోడ్. ఇది ఎవరికి వర్తిస్తుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిజానికి ఈ కోడ్ అనేది రాజకీయ పార్టీలకు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు, ప్రభుత్వానికి, ప్రజలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్రజలు కూడా కొన్ని రూల్స్ పాటించాలి. తమ దగ్గర ఎక్కువ డబ్బు పెట్టుకొని బయట తిరగొద్దు. ఏదైనా అవసరం ఉంటే 50 వేల కంటే ఎక్కువ నగదు వెంట తీసుకెళ్తే ఖచ్చితంగా వాటికి తగిన ఆధారాలు చూపించాలి. విలువైన వస్తువులేవీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు తీసుకెళ్లకూడదు. తీసుకెళ్తే.. దానికి తగ్గ ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభించకూడదు. ఎలాంటి కొత్త సంక్షేమ పథకాలను కూడా ప్రారంభించకూడదు. అలాగే.. కులాలు, మతాల మధ్య విభేదాలు పెరిగేలా మాట్లాడకూడదు. ఎలాంటి వైషమ్యాలు సృష్టించకూడదు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతర నాయకులను నిందించకూడదు. ఓట్ల కోసం డబ్బులు ఇవ్వడం, మద్యం ఇవ్వడం, తమకే ఓటేయాలని బెదిరించడం లాంటివి కూడా చేయకూడదు.
Telangana Assembly Elections 2023 : ఎన్నికల షెడ్యూల్ ముందు ప్రకటించిన స్కీమ్ లను కొనసాగించవచ్చు
ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ప్రకటించిన స్కీమ్ లను మాత్రం కొనసాగించవచ్చు. అయితే.. ప్రభుత్వం మాత్రం తమ పార్టీ కోసం ప్రభుత్వ సొమ్మును వినియోగించకూడదు. కులాలు, మతాలను అడ్డం పెట్టుకొని ఓట్లు అడగకూడదు. ఇతర పార్టీల నేతలపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా.. వాళ్లను టార్గెట్ చేస్తూ వాళ్ల పరువుకు భంగం కలిగేలా కూడా ప్రవర్తించకూడదు. ఏ పదవి ఉన్నా కూడా పోలింగ్ సెంటర్స్ లోకి వెళ్లడానికి వీలు లేదు. పోటీ చేసే అభ్యర్థులు కూడా ఎన్నికల అధికారుల నుంచి సరైన అనుమతి తీసుకొని ఓటింగ్ ప్రక్రియను తనిఖీ చేయొచ్చు.