AP Retaining Wall : వరదల సమయంలో రిటైనింగ్ వాల్‌పై రాజకీయ రగడ.. దాని ఘనత ఎవరిది?
ప్రధానాంశాలు:
AP Retaining Wall : వరదల సమయంలో రిటైనింగ్ వాల్‌పై రాజకీయ రగడ.. దాని ఘనత ఎవరిది?
AP Retaining Wall : ఏపీలో వరదలు ప్రజలని భయబ్రాంతులకి గురి చేయడం మనం చూశాం. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో కృష్ణానది వద్ద కట్టించిన రిటైనింగ్ వాల్ వ్యవహారం ఏపీలో వరదలు కొనసాగుతున్న క్రమంలో వైసిపి, టిడిపి వర్గాల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారింది. ఓవైపు విజయవాడను వరదలు ముంచెత్తి అనేక ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను వదిలి పునరావస కేంద్రాలకు తరలి వెళ్లి ఇబ్బందులు పడుతుంటే టిడిపి, వైసిపి శ్రేణులు కృష్ణలంక వద్ద నిర్మించిన రిటైనింగ్ వాల్ వ్యవహారంపైన సోషల్ మీడియా వేదికగా తిట్టిపోసుకుంటున్నారు. విజయవాడ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్ నిర్మాణంతో కృష్ణలంక, రామలింగేశ్వనగర్ తదితర ప్రాంతాలు వరద ముంపు నుంచి బయటపడ్డాయి.
AP Retaining Wall మేమంటే మేము..
ఈ రిటైనింగ్‌వాల్ ఘనత తమదేనని చెప్పుకునేందుకు వైసీపీ నానా అవస్థలు పడుతోంది. వాస్తవానికి కరకట్ట గోడను టీడీపీ హయాంలోనే సగానికిపైగా పూర్తి చేశారు. మొత్తం 4.7 కిలోమీటర్ల వాల్ నిర్మాణం మూడు ఫేజ్‌లలో నిర్మాణం చేయాల్సి ఉంది. మొదటి ఫేజ్ 2.37 కి.మీ. యనమలకుదురు నుంచి గీతానగర్ కట్ట వరకు రూ.165 కోట్లు, రెండో ఫేజ్ 1.23 కి.మీ. గీతానగర్ కట్ట నుంచి వారధి వరకు రూ.126 కోట్లు, మూడో ఫేజ్ 1.01 కి.మీ వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు రూ.110 కోట్లతో టీడీపీ హయాంలో 2016లోనే అంచనాలు తయారు చేయించారు. అయితే వైసీపీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృష్ణలంక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారని జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని కృష్ణలంక వాసులు చెబుతున్నారని పోస్ట్ పెట్టింది.
ఇక ఈ పోస్టులపైన తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నారు. కృష్ణలంక వద్ద రిటైనింగ్ వాల్ 2019లో చంద్రబాబు హయాంలో నిర్మించబడిందని కృష్ణలంక ప్రజలకు మేలు చేసింది జగన్ కాదు చంద్రబాబు అంటూ పోస్టులు పెడుతున్నారు. మీరు అబద్ధాలు చెప్పినా గూగుల్ అబద్ధం చెప్పదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో కూడా నాడు చంద్రబాబు హయాంలో పూర్తయిన రిటైనింగ్ వాల్ విజువల్స్ పోస్ట్ పెట్టారు. మొత్తం మేమే చేశామని వైసీపీ చెబుతుంటే.. అరే బాబోయ్ చరిత్ర తెలుసుకోకపోతే ఎలా..? టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి పడేస్తోంది. దీంతో ఈ వ్యవహారం అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో బర్నింగ్ టాపిక్ అయ్యింది.