AP Cabinet : ఏపీ కొత్త కేబినెట్లో వీరికి అవకాశం దక్కేనా..?
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ కూటమి భారీ స్థాయిలో విజయం సాధించింది.. త్వరలోనే అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు క్యాబినెట్ లో కొత్తగా మంత్రులయ్యేది ఎవరనే చర్చ రాష్ట్రంలో జోరుగా జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది మంత్రి పదవి రేసులో ఉన్నారు. అయితే పార్టీ నాయకత్వం మాత్రం సీనియర్లతో పాటుగా మహిళలు, యువత, సామాజిక వర్గాల వారీగా పరిశీలించి క్యాబినెట్ లో అవకాశం ఇవ్వాలని భావిస్తోందట. జిల్లాల వారీగా ఆశావహుల […]
ప్రధానాంశాలు:
AP Cabinet : ఏపీ కొత్త కేబినెట్లో వీరి అవకాశం దక్కేనా..?
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ కూటమి భారీ స్థాయిలో విజయం సాధించింది.. త్వరలోనే అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు క్యాబినెట్ లో కొత్తగా మంత్రులయ్యేది ఎవరనే చర్చ రాష్ట్రంలో జోరుగా జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది మంత్రి పదవి రేసులో ఉన్నారు. అయితే పార్టీ నాయకత్వం మాత్రం సీనియర్లతో పాటుగా మహిళలు, యువత, సామాజిక వర్గాల వారీగా పరిశీలించి క్యాబినెట్ లో అవకాశం ఇవ్వాలని భావిస్తోందట. జిల్లాల వారీగా ఆశావహుల సంఖ్య పెద్దగానే ఉన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ నుంచి 135 మంది గెలుపొందగా, ఎంతమందిని మంత్రి పదవి వరిస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఇక జనసేన విషయానికి వస్తే 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో ఎవరెవరికి బెర్తులు దక్కుతాయనే చర్చ జోరుగా నడుస్తోంది. బీజేపీ కూడా 8 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకోగా వారిలో నుంచి కూడా మంత్రి పదవులను ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏ పదవి తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే అచ్చెన్నాయుడు, గౌతు శిరీష (టీడీపీ)రేసులో ఉన్నారు. అయితే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కితే అచ్చెన్నాయుడికి మంత్రి పదవి ఇవ్వకపోవచ్చనే చర్చ జరుగుతోంది. విజయనగరం జిల్లా నుంచి కిమిడి కళా వెంకట్రావు (టీడీపీ) పేరు దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లాలో అయ్యన్నపాత్రుడు (టీడీపీ) పక్కాగా మంత్రి పదవి దక్కించుకుంటారని అభిమానులు అంటారు. పార్టీ కోసం ఆయన చేసిన కృషికి తగిన ఫలితం దక్కుతుందని అంటున్నారు. బీజేపీ నుంచి విష్ణు కుమార్ రాజు, జనసేన నుంచి కొణతాల రామకృష్ణ రేసులో ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత (టీడీపీ) రేసులో ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ (టీడీపీ) పేర్లు వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే.. పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, చింతమనేని ప్రభాకర్ (టీడీపీ) పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర, శ్రీరాం తాతయ్య (టీడీపీ), సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్ (బీజేపీ)ర రేసులో ఉన్నారు.
గుంటూరు జిల్లా నుంచి కన్నా నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, అనగాని సత్యప్రసాద్(టీడీపీ) పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే మంగళగిరి నుంచి గెలిచిన నారా లోకేష్ మంత్రివర్గంలో చేరడంపై క్లారిటీ లేదు. గతంలో అయితే తాను పదవిని తీసుకోనని చెప్పారు. ఇక జనసేన విషయానికి వస్తే నాదెండ్ల మనోహర్ కు మంత్రి పదవి వరిస్తుందనే చెప్పాలి. ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్ (టీడీపీ), నెల్లూరు జిల్లాలో నుంచి ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (టీడీపీ), చిత్తూరు జిల్లా నుంచి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డితో పాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరిని పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్ , కాలువ శ్రీనివాసులు (టీడీపీ), కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, ఫరూక్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరే కాకుండా సామాజిక సమీకరణాలు, ప్రాంతాలు, యువత, మహిళలు ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. కూటమి ప్రభుత్వం కాబట్టి జనసేన పార్టీ, బీజేపీ నుంచి కూడా మంత్రివర్గంలోకి కొందరు రాబోతున్నారు.