Maha Shivaratri : మాఘమాసంలో వచ్చే శివరాత్రే మహాశివరాత్రి ఎందుకు అయ్యింది ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Maha Shivaratri : మాఘమాసంలో వచ్చే శివరాత్రే మహాశివరాత్రి ఎందుకు అయ్యింది ?

 Authored By keshava | The Telugu News | Updated on :9 March 2021,6:00 am

‘‘బ్రహ్మమురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగమ్।

జన్మజ దు:ఖ వినాశకలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్॥’’

సమస్త జీవరాసులకు ప్రాణభూతమైన ఆ పరమేశ్వరుణ్ణి ‘శివుడు’ అని పిలుచుకుంటాం. దీనికి ప్రధానకారణం ఆయన లోకాలన్నింటికీ మంగళాలను అంటే శుభాలను ప్రసాదించేవాడు. అందుకనే ఆ మూర్తిని ‘శివ’ నామంతో స్మరిస్తుంటాం. శివం అంటేనే శుభం, సర్వమంగళం అని అర్థం. ప్రతి నెలా కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య ముందు చతుర్దశిని ‘మాస శివరాత్రి’గా జరుపుకొంటారు. కానీ మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశిని మాత్రం ‘మహా శివరాత్రి’గా స్వామిని సేవించుకోవడం ఆనవాయితి. అయితే ప్రతినెల వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా ఎందుకు జరుపుకోరు? కేవలం మాఘమాసంలో వచ్చే శివరాత్రినే మహాశివరాత్రిగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటాం దీనివెనుక కారణం, పురాణగాథలను తెలుసుకుందాం…

శివపురాణాంతరతమైన ‘విద్యేశ్వర సంహిత’ శివరాత్రి మహాత్యాన్ని గురించి సూతమహాముని సత్రయాగం చేస్తున్న ముని సత్తములకు వివరించినట్లు తెలిపింది. పరమశివుని గురించిన ప్రసక్తిని, ఆ శివుని వాహనమైన నందికేశ్వరునికి బ్రహ్మపుత్రుడైన సనత్కుమారునికి జరిగిన సంభాషణను ఆ సనత్కుమారుడు వేదవ్యాస మహర్షికి విపులీకరించాడు. ఆ పరమేశ్వరుని వృత్తాంతం శివుని మహత్తును విస్తృతంగా చెబుతున్నది. బ్రహ్మ, విష్ణువులలో ఎవరు గొప్ప అనే దానిపై జరిగిన యుద్ధంలో వారిరువురి మధ్య శివుడు మహాలింగ స్వరూపమై వెలసి మీరు ఒకరు నా మొదలు, రెండోవారు నా చివర కనుగొనండి ఎవరు కనుగొంటారో వారు గొప్పవారని మహాదేవుడు వారిద్దరికి పందెం పెట్టాడు. బ్రహ్మ, విష్ణువుల యుద్ధం ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తం కాగ బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగిరి. దీనికి కారణం.

History Of maha shivaratri

History Of maha shivaratri

ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రించుచున్న విష్ణువును చూసి, “నీవెవరవు నన్ను చూసి గర్వముతో శయ్యపై పరుండినావు లెమ్ము. నీ ప్రభువను వచ్చి ఉన్నాను నన్ను చూడుము. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడును” అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, “నీచూపులు ప్రసన్నంగా లేవేమి?” అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ “నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చినాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించువాడను” అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో “జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మము నుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు” అంటాడు.

ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేయుచుండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగిరి. ఇలా సమరం జరుగుచుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ఈశ్వరునికి దేవతలు ఆనందభాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లుతారు.

History Of maha shivaratri

History Of maha shivaratri

వారు బ్రహ్మ, విష్ణువుల యుద్దం గురించి శివుడికి తెలియజేసి ఆ మహాసంగ్రామం నుంచి లోకాన్ని కాపాడమని ప్రార్థిస్తారు. అప్పుడు శివుడు ఇదంతా నాకు తెలుసుక మీరు భయపకడకండి అని అభయమిచ్చి బ్రహ్మ, విష్ణువులు యుద్ధం చేసుకునే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ వారిరువురు… మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు.

ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయం లో మార్గమధ్యం లో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు (బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ ‘నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే” అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటి తో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మకి షోడశోపచారాలతో పూజ చేస్తాడు.కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆది ని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది.

కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు. మోసము చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు. ఈ లింగం ఆవిర్భవించిన రోజును మహాశివరాత్రిగా పేర్కొంటారు.

Advertisement
WhatsApp Group Join Now

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది