Balakrishna : ఇద్దరు హీరోలను దాటుకొని బాలకృష్ణ దగ్గరకు వచ్చిన అన్‌స్టాపబుల్ షో
Balakrishna : నందమూరి నటసింహం ఎక్కడైన తన సత్తా చూపించగలను అని అన్‌స్టాపబుల్ షోతో నిరూపించాడు. ముందుగా బాలకృష్ణ హోస్ట్ గా అన్‌స్టాపబుల్ షో అని వార్తలు రాగా, అందరు ఉలిక్కిపడ్డారు. ఆయన న్యాయం చేయగలడా లేదా అనే అనుమానం అందరి మదిలో తలెత్తింది. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఓటీటీ వేదికల్లో మునుపెన్నడూ లేని విధంగా ఐఎమ్‌డీబీలో 9.8 రేటింగ్ సాధించి రికార్డులు బద్దలు కొట్టిందీ షో. ఈ కాన్సెప్టు విన్న తరువాత బాలకృష్ణ అయితే ఎలా ఉంటుందని తాను తన టీమ్ ను అడిగాననీ అప్పుడు అందరిలో వచ్చిన రియాక్షన్ చూసిన తరువాతనే బాలకృష్ణకి కాల్ చేశానని వేదికపై అల్లు అరవింద్ చెప్పారు. అడగ్గానే ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా బాలకృష్ణ వెంటనే ఒప్పేసుకున్నారని అన్నారు.
ఈ టాక్ షోకి స్క్రిప్ట్ పరమైన పార్టిసిపేషన్ ను సినిమా రచయిత బీవీఎస్ రవి అందించాడు.ఆయన ఈ షోకి పలు విషయాలు తెలియజేస్తూ ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నారు. ‘అన్ స్టాపబుల్’ కోసం ముందుగా వెంకటేశ్ ను సంప్రదించారట.
వెంకటేశ్ కి మంచి సమయస్ఫూర్తి ఉంది. అందువలన ఈ షోను సరదాగా సందడిగా నడిపిస్తూ రక్తి కట్టిస్తాడని భావించారు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా ఈ షో చేయడానికి వెంకటేశ్ అంగీకరించకపోవడంతో నానీని సంప్రదించారట. నాని ఎదుటివారి మనసును నొప్పించకుండా తాను అనుకున్న సమాధానాలను రప్పించగల తెలివితేటలు ఉన్నాయి.
Balakrishna : ఇద్దరిని దాటి…
‘బిగ్ బాస్’ వంటి పెద్ద రియాలిటీ షోను నడిపించిన సామర్థ్యం నానిలో ఉంది. అందువలన ఆయనను సంప్రదించారట. అయితే అప్పటికే నాని వరుస సినిమాలను ఒప్పేసుకుని ఉన్నాడు. అవన్నీ కూడా వరుసగా పూర్తి చేయవలసి ఉంది. కాల్షీట్స్ ఖాళీగా లేకపోవడంతో బంతి బాలయ్య కోర్ట్‌లో పడింది. ఇక అప్పటి నుండి బాలయ్య తనదైన శైలిలో చెలరేగిపోతూ షోని సక్సెస్ ఫుల్‌గా నడిపించాడు. ఫిబ్రవరి 4న తొలి సీజన్‌కి బ్రేక్ పడనుంది. చివరి ఎపిసోడ్‌కు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరుకానున్న విషయం తెలిసిందే. గతకొన్ని రోజులుగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.