Mrunal Thakur : మరో అందాల రాక్షసిని తీసుకు వచ్చావు.. దర్శకుడిపై ప్రశంసలు
Mrunal Thakur : కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన అందాల రాక్షసి సినిమా తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మర్చి పోరు. కమర్షియల్ గా థియేటర్లలో భారీ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయినా కూడా ఇప్పటికి కూడా టీవీలో మరియు ఓటీటీ లో వచ్చినప్పుడు సందడి చేస్తూనే ఉంది. ప్రేక్షకులు ఆ సినిమా ను చూసేందుకు ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. అందుకు ప్రధాన కారణం అందులో ఉన్న హీరోయిన్ పాత్ర.. ఆ పాత్రలో నటించిన లావణ్య త్రిపాఠి. హీరోయిన్ ను అద్బుతంగా చూపించిన దర్శకుడు హను రాఘవపూడి మళ్లీ సక్సెస్ అయ్యాడు.
చాలా విభిన్నమైన కథ.. అద్భుతమైన కథ అంటూ గత కొన్ని వారాలుగా.. ఆ మాటకు వస్తే నెలలుగా సీతారామం గురించిన చర్చ జరుగుతోంది. ఇలాంటి ఒక సినిమా ను ఇప్పటి వరకు మీరు చూసి ఉండరు.. ఇలాంటి ఒక కథ గురించి కనీసం మీరు ఊహించి ఉండరు అనేది యూనిట్ సభ్యుల మాట. అంతగా ప్రమోట్ చేయడంతో పాటు సినిమాలోని సీత పాత్రను కూడా చాలా బలంగా ఉంటుందని చెబుతూనే వచ్చారు. నిజంగానే సీతారామం సినిమాలోని సీత పాత్ర ఒక అద్భుతం అన్నట్లుగా ఉందంటూ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అందాల రాక్షసి సినిమాలో లావణ్య త్రిపాఠిని ఎంతగా అయితే అభిమానించామో అంతకు రెండు మూడు రెట్లు ఈ సినిమాలోని సీత పాత్రలో నటించిన మృనాల్ ఠాకూర్ ను అభిమానించేంతగా ఆ పాత్ర ఉంది అంటూ సినిమా చూసిన వారు అంటున్నారు. హీరోయిన్ మృనాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు ఇదే మొదటి సారి పరిచయం అయినా కూడా చాలా సీనియర్ హీరోయిన్ నా అన్నట్లుగా ఆ పాత్రను ఓన్ చేసుకున్నారు. హీరోయిన్ మృనాల్ నా లేదా మరొకరా అనే విషయం కాకుండా సీత ను అందులో చూస్తున్నారు. ఇలాంటి హీరోయిన్ పాత్ర ను సృష్టించిన దర్శకుడు హను పై ప్రశంసల వర్షం కురుస్తోంది.