Telangana BJP : బీజేపీకి 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారా..? కమళం గౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది..?
Telangana BJP : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. సౌత్ ఇండియాలో ఒక్క రాష్ట్రంలో కూడా ప్రస్తుతం బీజేపీ అధికారంలో లేదు. మొన్నటి వరకు కర్ణాటకలో ఉండేది కానీ.. అక్కడ అధికారాన్ని కాంగ్రెస్ లాగేసుకుంది. దీంతో సౌత్ ఇండియాలో ప్రస్తుతం బీజేపీ శూన్యం. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఆ పార్టీకి అంత బలం లేదు. త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో ఎలాగైనా పాగా వేసి ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టాలని భావిస్తోంది.
అందుకే.. ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రవాస యోజనలో భాగంగా ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణలోని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో అంచనా వేస్తున్నారు. గ్రౌండ్ లేవల్ లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. అనే దానిపై నేతలు అధ్యయనం చేస్తున్నారు. అందుకే వాళ్లంతా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇక్కడి బీజేపీ నేతలను నమ్ముకుంటే మళ్లీ ఓటమి ఖాయం అని అనుకున్నారో ఏమో.. అందుకే బీజేపీ హైకమాండ్ వేరే రాష్ట్రాల ఎమ్మెల్యేలను ఇక్కడ దించింది.వీళ్లంతా తెలంగాణ పరిస్థితిపై గ్రౌండ్ లేవల్ లో రిపోర్ట్ తయారు చేసి నేరుగా దాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పంపించనున్నారట. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ తెలంగాణలోనే మకాం వేశారు.
Telangana BJP : డైరెక్ట్ గా అమిత్ షాకే రిపోర్ట్
వీళ్లు క్షేత్రస్థాయిలో నియోజకవర్గాలు తిరిగి ఇక్కడ పరిస్థితిని అంచనా వేసి ఎవరికి టికెట్ ఇవ్వాలి.. ఎవరికి ఇవ్వొద్దు అనే దానిపై నివేదిక ఇవ్వనున్నారట. వాళ్లు ఇచ్చిన నివేదిక ఆధారంగానే తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో బీజేపీ టికెట్స్ కేటాయిస్తుందని తెలుస్తోంది. పబ్లిక్ వాయిస్ కూడా వీళ్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పటి వరకు ఏ పార్టీ ఉపయోగించని స్ట్రాటజీని బీజేపీ ఉపయోగిస్తోంది. అందుకే వేరే రాష్ట్రాల ఎమ్మెల్యేలను ఇక్కడ దించి సర్వే చేయిస్తోంది అన్నమాట. మరి.. మన బీజేపీ నేతల్లో ఎవరికి టికెట్లు దక్కుతాయో వేచి చూడాల్సిందే.