Tirupathi By Elections : తిరుపతి ఉప ఎన్నిక ‘జగన్ వర్సెస్ చంద్రబాబు’ మాత్రమే
Tirupathi By Elections : తిరుపతి ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ ఖాయం అంటూ మొన్నటి వరకు అంతా భావించారు. కాని తాజాగా పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తిరుపతి ఉప ఎన్నకల్లో పోటీ చేయడం లేదని బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థికి మద్దతుగా నిలువబోతున్నట్లుగా ప్రకటించాడు. పవన్ ప్రకటనతో జనసేన మరియు బీజేపీ కి చెందిన నాయకులు మరియు కార్యకర్తలు నీరుగారి పోయారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ గాలికి ఊగిసలాడుతున్న సముద్రమద్యలో ఉన్న నావ మాదిరిగా ఉంది. ఇలాంటి సమయంలో తిరుపతి ఉప ఎన్నికల్లో వారికి అవకాశం ఇవ్వడం అనేది ఖచ్చితంగా పవన్ తీసుకున్న మరో తప్పుడు రాజకీయ నిర్ణయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ నిర్ణయం తో ఇప్పుడు పోటీ మొత్తం కూడా తెలుగు దేశం పార్టీ మరియు వైకాపాల మద్యకు మారింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు ప్రతిపక్ష నేతలు ఇద్దరు కూడా తిరుపతి సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ సీటు కనుక వైకాపా ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అనే నమ్మకంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇదే సమయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగా టీడీపీకి ఓటు వేస్తారనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు. మొత్తానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు చంద్రబాబు నాయుడులు ఇద్దరు కూడా తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ ప్రచారం చేస్తున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలను ఇది ఒక పరీక్ష అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు బలంగా ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ పరిపాలన ను బట్టి ఓటు వేయండి అంటూ చంద్రబాబు నాయుడు మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ప్రజలకు అందుతున్న అభివృద్ది ఫలాలు మరియు సంక్షేమ పథకాలను చూసి ఓట్లు వేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ తో బీజేపీ ని జనాలు పట్టించుకునే పరిస్థితి లేదు. దాంతో తిరుపతి ఉప ఎన్నిక పూర్తిగా చంద్రబాబు నాయుడు వర్సెస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నట్లుగా మారిపోయింది.