Plantation : 30 వేల మొక్కలు నాటిన బాహుబలి మాస్టారు గురించి చదివి తీరాల్సిందే..!
Plantation Bahubali : మనం జీవితం మొత్తం మీద ఎన్ని మొక్కలు నాటి ఉంటాం?. మహా అయితే ఐదో పదో. కానీ ఈయన ఇప్పటి వరకు ఏకంగా 30 వేలకు పైగా మొక్కలు నాటాడు. పువ్వు పుట్టగానే పరిమళించింది అంటారు కదా. దానికి చక్కని ఉదాహరణగా నిలిచాడు. ఈయన పేరు అంతర్యామి సాహు. వయసు 75 ఏళ్లు. ఒడిశా రాష్ట్రానికి చెందినవాడు. 11 ఏళ్ల ప్రాయంలోనే మొక్కలు నాటడం మొదలు పెట్టాడు. 64 ఏళ్లుగా ఆ పనిని కొనసాగిస్తున్నాడు. టీచర్ గా పనిచేస్తూ పిల్లల చేత కూడా మొక్కలు నాటించేవాడు. తద్వారా ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా ‘‘ట్రీ టీచర్’’ అనే గొప్ప పేరు సంపాదించుకున్నాడు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు పొందాడు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ పది మందికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రజల ప్రశంసలను అందుకుంటున్నాడు.
అదొక్కటే చాలదు.. : Plantation Bahubali
పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మొక్కలు మాత్రమే నాటితే చాలదని అంతర్యామి సాహు అంటున్నాడు. అడవులను, వాటిలోని జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నాడు. అడవులు అగ్నికి ఆహుతి కాకుండా కంటికి రెప్పలా కాచుకోవాలని, అడవుల్లోని వివిధ జంతువులు ఆ మంటల్లో కాలి బూడిదవకుండా రక్షించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఈ విషయాలనే సచిత్రంగా చాటుతున్నాడు.స్వయంగా బొమ్మలు గీచి ఆయా పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నాడు. ప్రకృతిలో ప్రతి జీవీ ఒకదానిపై ఒకటి ఆధారపడి బతుకున్న వైనాన్ని అక్షరమ్ముక్కరానివారికి కూడా అంతర్యామి సాహు అర్థమయ్యేలా వివరించాడు. సోషల్ మీడియా లేని రోజుల్లో ఎంతో శ్రమకోర్చి ఈ ప్రచార పత్రికలను తయారుచేసేవాడు.
రీసెంటుగా సామాజిక మాధ్యమంలోనూ ఖాతా తెరిచి డిజిటల్ గా సైతం తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు. వందలు, వేల సంఖ్యలో లైకులు, షేర్లు, కామెంట్లు పొందుతున్నానని, దీన్నిబట్టి తనను ఎంత మంది ఫాలో అవుతున్నారో అర్థమవుతోందని అంటున్నాడు.
అనుకున్నది సాధించాడు..
అంతర్యామి సాహు మొత్తానికి అనుకున్నది సాధించాడు. తన ప్రయత్నాల వల్ల 2001-08 మధ్య కాలంలో ఒడిశాలో అటవీ దహనాల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గాయని పేర్కొన్నాడు. ఎక్కడెక్కడ అటవీ దహనాలు ఎక్కువగా జరుగుతున్నాయో ఆయా హాట్ స్పాట్లను గుర్తించి ప్రభుత్వానికి చెప్పేవాడు. సర్కారుతోపాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో జిల్లా వ్యాప్తంగా నాలుగు బయో డైవర్సిటీ పార్కులను నెలకొల్పాడు. గడచిన ఐదు దశాబ్దాల కాలంలో తాను చేసిన పనిని చూసి దాదాపు 30 వేల మంది ప్రభావితమయ్యారని అంతర్యామి సాహు ఆనందం వెలిబుచ్చారు. అంతర్యామి చేస్తున్న కృషికి లోకల్ మీడియా సైతం బాగా ప్రచారం కల్పిస్తోంది. తనకు మరో నలుగురు తోడైతే ఈ కార్యక్రమం మరింత విజయవంతమవుతుందని కోరుకుంటున్నాడు.