Oxygen : భార్య ఆక్సీజన్ లేక చనిపోయిందని.. భర్త చేస్తున్నా ఒక గొప్ప పని..!
Oxygen : కరోనా సెకండ్ వేవ్ లో దేశం మొత్తం కలవరించిన ఒకే ఒక్క మాట ఆక్సీజన్. చేతిలో లక్షల రూపాయలున్నా కొనటానికి కేజీ ప్రాణవాయువు కూడా అందుబాటులో లేకపోవటం వల్ల ఎంతో మంది తుది శ్వాస విడిచారు. ఆక్సీజన్ కొరత ప్రభావం మనకు చరిత్రలో తొలిసారి తెలిసొచ్చింది. కుప్పలు తెప్పలుగా శవాలు స్మశానాలకు వస్తుండటంతో వాటిని దహనం చేయటానికి కలప సైతం సరిపోను దొరకకపోవటం విచారకరం. ఈ రెండు సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఒక వ్యక్తి చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతుగా పాటుపడుతున్నాడు.
భార్య జ్ఞాపకార్థం..Oxygen
గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన ధృవల్ పటేల్ కుటుంబంలో నలుగురు కరోనా బారిన పడ్డారు. ధృవల్ దంపతులు, తండ్రి, కుమారుడికి కొవిడ్ సోకింది. మగవాళ్లు ముగ్గురూ కోలుకున్నారు కానీ ధృవల్ భార్య నేహాకి మాత్రం ఆరోగ్యం విషమించింది. సమయానికి ఆక్సీజన్ అందక గత నెల 12న చనిపోయింది. దీంతో ధృవల్ కుటుంబం కుంగిపోయింది. 17 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎప్పుడూ విడివిడిగా ఉండని ధృవల్, స్నేహ దంపతులను విధి విడదీసింది. ధృవల్ కి నిత్యం స్నేహ జ్ఞాపకాలే గుర్తుకొస్తుండటంతో ఆమె కోసం సమాజానికి ఏదైనా ఉపకారం చేయాలని నిర్ణయించుకున్నాడు.
అంత్యక్రియలు చేసిన చోటే.. : Oxygen
స్నేహ అంత్యక్రియలను సిధ్ పూర్ ప్రాంతంలోని స్మశాన వాటికలో నిర్వహించారు. ఆ సమయంలో అక్కడి పెద్దలు ధృవల్ కి ఒక సలహా ఇచ్చారు. ఈ స్మశాన వాటికలో కుటుంబ సభ్యల అంత్యక్రియలను నిర్వహించినవారు మూడు మొక్కలను నాటాలని, అవి పెరిగి పెద్దవయ్యాక వాటి నుంచి వచ్చే కలప మరొకరి దహన సంస్కారాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. దీంతో ధృవల్, అతని కుమారుడు పూర్వ.. ఆ ప్రాంతంలో ఇప్పటివరకు 450కి పైగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని చెప్పారు. అలా పెరిగే ప్రతి మొక్కలోనూ స్నేహను చూసుకుంటానని ధృవల్ ఎమోషనల్ గా తెలిపారు. భార్య లేని జీవితం భారంగా గడుస్తోందని ఆవేదన చెందుతున్నాడు. ఇంతటి దుఖంలోనూ ధృవల్.. సొసైటీ గురించి, పర్యావరణం గురించి ఆలోచిస్తుండటం పది మందికీ ఆదర్శనీయం.