Kurnool..టమాటాకు గిట్టుబాట ధర కల్పించాలి: రైతు సంఘాల డిమాండ్
జిల్లాలోని టమాటా రైతాంగానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. పత్తికొండ పట్టణ వ్యవసాయ మార్కెట్‌లోని టమాటా మార్కెట్‌ను బుధవారం ఏపీ రాష్ట్రరైతు సంఘం నాయకులు రామచంద్రయ్య ఆధ్వర్యంలో పలు సంఘాల నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టమాటా రైతులను రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నాయకులు రామచంద్రయ్య మాట్లాడుతూ టమాటా పంటకు రాష్ట్రసర్కారు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. టమాటా రైతన్నల పరిస్థితి ప్రస్తుతం ఆగమ్యగోచరంగా మారిందని తెలిపారు.
రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్యర్యంలో రైతుల వద్ద నుంచి పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. నాణ్యమైన టమాటా పంటకు గిట్టుబాటు కల్పించాలని, మార్కెట్‌లో రైతులకు సరియైన ధర లభించడం లేదని వివరించారు. ఈ క్రమంలోనే నాయకులు రాష్ట్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరసన కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు, సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, పత్తికొండ మండల రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.